ఇక, ఈ కేటగిరీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం - ఇవి తప్పనిసరి..!!
ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. మహిళల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ మేరకు మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఉచిత ప్రయాణం బస్సులను లైవ్ ట్రాకింగ్ విధానం అందుబాటులోకి తెస్తున్నారు. ఘాట్ రోడ్లలో తిరిగే బస్సుల్లోనూ పథకం అమలు చేస్తున్నారు. ఇక.. తాజాగా మరో కేటగిరీ బస్సుల్లోనూ పథకం అమలు చేస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.
ఏపీ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయిదు రకాల బస్సుల్లో ఇప్పటి వరకు అమలుకు వీలుగా ఆదేశాలు అమలు అవుతున్నాయి. కాగా, కొన్ని బస్సులకు కండక్టర్లు లేకుండా.. రెండు మూడు బస్టాండ్లలో మాత్రమే ఆగేలా నడుపుతున్నారు. అటువంటి బస్సులకు ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్లు (గ్రౌండ్ బుకింగ్) చేస్తారు. ఇటువంటి పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఇక ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు వెల్లడించారు. వెంటనే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజియన్లకు అదేశాలు జారీ చేసారు. ఇదే సమయంలో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక, సింహాచలం కొండపైకి నడిచే సిటీ బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నారు. ఈ బస్సులకు ఘాట్ టోల్ ఫీజు వసూలు చేయకుండా మినహాయించాలని దేవస్థానం ఈవోకి ఆర్టీసీ అధికారులు లేఖ రాసారు. తిరుమల ఘాట్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 39 ఘాట్ రోడ్ల పై బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఇదే సమయంలో ఉచిత బస్సుల్లో ప్రయాణం వేళ గొడవలకు దిగి బూతులు తిట్టుకున్న వారి పైన కేసు నమోదు చేసారు. బొబ్బలి నుంచి విశాఖ వెళ్తున్న బస్సులో సీటు విషయంలో ఒక వ్యక్తి.. ఒక మహిళ ఘర్షణకు దిగారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరి కారణంగా తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలిగిందని ఫిర్యాదులు అందాయి. దీంతో, ఆ ఇద్దరి పైన పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పార్వతీ పురం ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందాయి.












Click it and Unblock the Notifications