ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అంత వరకే.. ! ఆర్టీసీ ఎండీ ప్రకటన..!
ఏపీలో కూటమి సర్కార్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్దమవుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ సూపర్ సిక్స్ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందా లేక కొత్త జిల్లాల పరిధిలోనే అమలు చేస్తారా లేక పాత జిల్లాల్ని పరిగణనలోకి తీసుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేసారు.
రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు కొత్త బస్సులు సమకూర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు కలిపి 1350 కొత్త బస్సులు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇప్పటికే ఇందులో 700 మంజూరు మంజూరు కాగా.. మరో 600 బస్సులు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కోసం ప్రస్తుతం ఉన్న మొత్తం 11 వేల బస్సుల్లో 74 శాతం బస్సులు కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. మరోవైపు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కొత్త జిల్లాల వరకే ఇవ్వాలని అనుకున్నామని, అయితే దీన్ని ఉమ్మడి జిల్లాల పరిధిలోకి విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ఇప్పటివరకైతే కొత్త జిల్లాల వరకే అమలు కాబోతున్నట్లు ఆయన చెప్పకనే చెప్పేశారు.
కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలు చేసేందుకు మహిళలకు ఈ పథకం అమలు జరుగుతుందని వారు ఎదురుచూస్తున్నారు. అయితే దీన్ని జిల్లాల పరిధిలోనే అమలు చేస్తామని ఇప్పటికే మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అసెంబ్లీలో, సీఎం చంద్రబాబు శ్రీశైలంలో చెప్పేశారు. కానీ తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని చేసిన ప్రకటన ప్రభుత్వంలో కలకలం రేపింది. ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోవడం, మంత్రులు తలోరకంగా చేస్తున్న ప్రకటనలతో ఏర్పడిన గందరగోళం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో దీంతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ ఎండీ ప్రకటన బట్టి చూస్తుంటే ఆగస్టు 15 నుంచి ముందుగా కొత్త జిల్లాలతో ఉచిత బస్సు పథకం ప్రారంభించి అనంతరం దీన్ని పాత జిల్లాలకు విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించి ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ ఇప్పటికే విపక్షాలు విమర్శలు మొదలుపెట్టేశాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక తరహాలో ఏపీలోనూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాల్సిందేనని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కొత్త జిల్లాలకే ఈ పథకం పరిమితం చేస్తే మాత్రం విమర్శలు ఎదుర్కోక తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications