పెగాసస్ నిఘా పై కమిటీ ఏర్పాటు - టార్గెట్ చంద్రబాబు : మమతా బెనర్జీ వ్యాఖ్యలతో..!!
చంద్రబాబు పెగాసెస్ నిఘా స్పై వేర్ కొనుగోలు ఆరోపణలపైన కమిటీ ఏర్పాటైంది. దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన పెగాసెస్ స్పై వేర్ పైన సుప్రీం కోర్టు కమిటీ నియమించింది. అయితే, తాజాగా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు. తన వద్దకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్ముతామని వచ్చారని..తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా నాటి ఏపీ సీఎం చంద్రబాబు కొనుగోలు చేసారంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యాయి. దీని పైన అధికార వైసీపీ సభలో చర్చకు చేపట్టింది.

మమతా బెనర్జీ వ్యాఖ్యలతో కలకలం
అయితే, మమతా బెనర్జీ సమాచారం లోపంతో అలా వ్యాఖ్యానించారని..తాము ఎటువంటి పెగాసెస్ కొనుగోలు చేయలేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి..నాటి మంత్రి లోకేష్ స్పష్టం చేసారు. తాము కొనుగోలు చేసి ఉంటే..మూడేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ చర్యలు తీసుకోకుండా ఉంటారా అని ప్రశ్నించారు. అయితే, చంద్రబాబు హాయంలో వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసారంటూ సభలో జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారదు. తమతో పాటుగా బీజేపీ నేతల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని చెప్పుకొచ్చారు. దీని పైన మాట్లాడిన మంత్రి బుగ్గన..పెగాసెస్ అధికారికంగా కొనుగోలు చేయలేదని..ఇటువంటివి అనధికారికంగా అమలు చేస్తారంటూ ఆరోపించారు.

అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ .. అనుమానాలు
చంద్రబాబు హయాంలో ఐటీ గ్రిడ్స్ సంస్థకు రాష్ట్ర ప్రజల డేటా వ్యక్తిగత సమాచారం లీక్ చేసి..టీడీపీకి ఓట్లు వేసే వారెవరో తెలుసుకొనే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. దీనికి నాటి నిఘా చీఫ్ సహకరించారని చెప్పుకొచ్చారు. దీని పైన చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వేంకటేశ్వర రావు సైతం స్పందించారుద. తన హయాంలో పెగాసెస్ కొనుగోలు చేయలేదని..అటువంటి ఆలోచనలు చేయలేదని స్పష్టం చేసారు. అయితే, సభలో మంత్రులు ఈ మొత్తం వ్యవహారం పైన సభా కమిటీ వేయాలని స్పీకర్ ను కోరారు. దీనికి అంగీకరించిన స్పీకర్ తమ్మినేని..ఈ రోజు సమావేశాల ముగింపు వేళ సభా కమిటిని ప్రకటించారు.

సభా సంఘం ఏర్పాటు.. సభ్యులుగా
ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు. వీరు నాడు జరిగిన పరిణామాలు.. అందుబాటులో ఉన్న సమాచారం పరిశీలించి.. అధ్యయనం చేసి సభకు నివేదిక ఇవ్వనున్నారు. అయితే, పెగాసెస్ పైన సభా కమిటీ కాకుంటే సీబీఐ విచారణ చేయించినా తమకు అభ్యంతరం లేదని నారా లోకేష్ తేల్చి చెప్పారు. చంద్రబాబు సంప్రదాయాలకు విలువ ఇస్తారని చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు ఈ సభా కమిటీ ఏం చేయబోతున్నదనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications