ఏపీ వాసులకు నెలకు రూ.5వేలు.. వృద్ధాప్యంలో బాసటగా నిలిచే ఈ కేంద్రపథకం!
తెలుగు రాష్ట్రాలలో వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పెన్షన్ పథకాన్ని అందిస్తోంది. ఆ పథకమే అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యం తర్వాత భద్రత కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇలా చెయ్యాలి .. కానీ ఆ ఏజ్ లోపే
బ్యాంకులలో అకౌంట్స్ ఉన్న ఖాతాదారులు ప్రతినెల, లేదా మూడు నెలలకు, లేదా ఆరు నెలలకు ఒకసారి చెల్లించే విధంగా బ్యాంకులో డబ్బులను జమ చేసుకోవాలి. వయసును బట్టి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ళ వయసులో చేరితే నెలకు 42 రూపాయల నుంచి రూ.210 వరకు, 40 ఏళ్ళ వయసులో చేరితే నెలకు రూ. 145 రూపాయల నుంచి రూ.1454 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

వెయ్యి నుండి 5 వేల వరకు వృద్ధాప్య పెన్షన్
ఈ స్కీమ్ లో చేరితే ఎంచుకునే పింఛను వెయ్యి రూపాయల నుండి 5000 రూపాయల వరకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలవారీగా అందుతుంది. ఈ స్కీమ్ లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఇద్దరూ మరణిస్తే నామినీకి ఈ మొత్తం అందుతుంది. ఇప్పటికీ చాలా మందికి అవగాహనలో లేని ఈ పెన్షన్ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 46 లక్షల మంది చేరారు.
వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పథకం కీలకపాత్ర
ఈ విషయాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రవేశ్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన క్రెడిట్ ఔట్ రీచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులతో పాటు దేశంలోని ప్రతి సామాన్య పౌరుడికి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పథకం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
2026- 27 సంవత్సరంలో 7.51 లక్షల మందిని ఈ స్కీమ్ లో చేర్చే లక్ష్యం
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు హామీతో కూడిన పెన్షన్ అందుతుందని తెలిపారు. పథకం అమలులో బ్యాంకులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. 2026- 27 సంవత్సరంలో 7.51 లక్షల మందిని ఈ పథకంలో చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఏపీలో జులై 31 నాటికి 2.31 లక్షల మంది నమోదు
జులై 31 నాటికి 2.31 లక్షల మంది నమోదు అయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రజలకు వృద్ధాప్యం తర్వాత ఆర్థిక భరోసా కల్పించేలా ఈ స్కీమ్ లో చేర్చేలా బ్యాంకర్లు సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications