రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల తీరొద్దు.. పైల్స్ పేషెంట్ అచ్చెన్న అరెస్టు దారుణం.. చంద్రబాబు ఫైర్
''రెండు రోజుల కిందటే అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని బలవంతంగా ఎత్తుకెళతారా? భార్యకు చెప్పి వస్తానని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోరా? విచారణకు పిలిస్తే తను రానన్నాడా? నోటీసులిస్తే స్పందించలేదా? అసలతను చేసిన నేరమేంటి? అధికారం ఉంది కదా అని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే ఆటలు సాగుతాయనుకుంటున్నారా?" అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జూమ్ కాన్ఫరెన్స్..
అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలోతొక్కిందని చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన.. ఈఎస్ఐ స్కాం మూలాలతోపాటు జగన్ సర్కారు అనుసరిస్తోన్న తప్పుడు విధానాలను ప్రస్తావించారు.

అచ్చెన్న పేరేది?
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్ తయారు రూపొందించిన రిపోర్టులో.. డైరెక్టర్లు రవికుమార్, రమేశ్ , విజయ్ ల పేర్లు మాత్రమే ఉన్నాయని, అచ్చెన్నాయుడి ప్రస్తావన లేనేలేదని చంద్రబాబు వెల్లడించారు. ‘‘ఈఎస్‌ఐ మాన్యువల్ చేస్తే అన్ని వాస్తవాలు తెలుస్తాయి. నిర్ణయాలన్నీ అధికారులే తీసుకుంటారు తప్ప మంత్రి పాత్ర ఎక్కడా ఉండదు. తెలంగాణలోనూ ఇలాంటి కేసే జరిగితే అక్కడ అధికారులపైనే విచారణ చేశారు. కానీ ఏపీలో జగన్ మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే అచ్చెన్నను అరెస్టు చేయించారు''అని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు.

ఆంబోతు.. బంట్రోతు అన్నారు..
బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడిని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అవమానించిందని, సీఎం జగన్ తన నోటితోనే అచ్చెన్నను ఆంబోతు అని, బంట్రోతు అని అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. పీపీఈ కిట్లు అడినందుకు డాక్టర్ సుధాకర్‌ను వేధించినట్టే.. వైసీపీ ప్రభుత్వ దోపిడిని అడ్డుకుంటున్నామనే అక్కసుతో టీడీపీ నేతలపై ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి, 11 చార్జిషీట్లలో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్.. అందరిపైనా బురదచల్లి పైశాచికానందాన్ని పొందాలనుకుంటున్నారని బాబు ఆరోపించారు.

రాజారెడ్డి రాజ్యాంగం..
‘‘అధికారం ఉందికదాని జగన్ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు తన సొంతదైన రాజారెడ్డి రాజ్యాంగ్యాన్ని, పులివెందుల పంచాయితీ తీరును అంతటా అమలు చేస్తున్నారు. అమెరికాలో కూడా ట్రంప్ ఇష్టానుసారం ప్రవర్తిస్తే దేశం తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ జగన్ కు కూడా అదే గతి పడుతుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. గతంలో అమలైన 34 వెల్ఫేర్ స్కీముల్ని రద్దు చేశారు. ఇసుక నుంచి భూముల దాకా అడ్డగోలుగా అమ్ముకుంటూ ఆ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుక్కుంటున్నారు''అని బాబు దుయ్యబట్టారు.
Recommended Video

దేశంలో టాప్ ట్రెండ్..
జగన్ అక్రమ వ్యవహారాలు ఏపీ ప్రజలతో దేశం మొత్తానికి అర్థమైందని, కాబట్టే అచ్చెన్న అరెస్టును నిరసిస్తూ రూపొందిన ‘‘వియ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు''హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోందని చంద్రబాబు తెలిపారు. తన సుదీర్ఘరాజకీయ జీవితంలో.. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి నీచమైన కార్యక్రమాలను ఏనాడూ చూడలేదని, ఓ నేరస్తుడే ముఖ్యమంత్రి అయి అందరిపై పైశాచికంగా కక్ష తీర్చుకుంటున్న పరిస్థితి ఏపీలో మాత్రమే ఉందని బాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications