శ్రీవారి భక్తులకు గమనిక.. నేటి నుంచే అర్జిత సేవా టికెట్లు విడుదల...
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ఓ ముఖ్య గమనిక. నేటి నుంచే జూన్ నెల అర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. గురువారం ఉదయం నుంచే భక్తుల సౌకర్యార్థం జూన్ నెల అర్జిత సేవా టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడి పేర్కొంది. ఉదయం పది గంటలనుంచే శ్రీవారి సేవ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర వంటి టికెట్లతో పాటు దర్శన టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఇందుకోసం https://ttdevasthanams.ap.gov.in ఈ వెబ్‌సైట్ ద్వారా జూన్ నెల వారి అర్జిత సేవా టికెట్లు, దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

జూన్ 19నుంచి 21 వరకు జ్వేష్టాభిషేకం ఉత్సవాలు..
జ్వేష్టాభిషేకం ఉత్సవాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా టీటీడీ పేర్కొంది. జూన్ 19 నుంచి జూన్ 21వ తేదీవరకు తిరుమలలో జరిగే జ్వేష్టాభిషేకం ఉత్సవాలలో భక్తులు పాల్గొనేందుకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. గురువారం ఉదయం పది గంటల నుంచే టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇది పరీక్షల కాలం కావడంతో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి సుమారు పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. ఇక, బుధవారం నాడు తిరుమల శ్రీవారిని 69,072 మంది దర్శించుకోగా, 26,239 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.51కోట్లుగా లెక్కించబడిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300లతో మూడు గంటల సమయం పడుతుంది. ఇక, టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులు ఆరు కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications