ఏయు ప్రొఫెసర్ అరెస్ట్: ఉద్రిక్తత, ఆనంకు చేదు
విశాఖ: విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జె అప్పారావును బుధవారం రాత్రి కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిని అర్ధరాత్రి పూట ఎవరో వచ్చి కిడ్నాప్ చేశారని వారు ఆరోపించారు. ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అప్పారావు ఇంటికి వచ్చిన కొందరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి తీసుకు వెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కొందరు అగంతకులు బలవంతంగా అతనిని కారులో ఎక్కించుకుపోయారని చెప్పారు. అప్పారవు ఏయు క్వార్టర్సులో ఉంటున్నారు.

మేమే అరెస్టు చేశాం: ఎస్పీ ప్రవీణ్
ఏయు ప్రొఫెసర్ అప్పారావును తామే అరెస్టు చేశామని విశాఖ రూరల్ ఎస్పీ ప్రవీణ్ గురువారం ఉదయం తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో అతనిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సాయంత్రం అతనిని మీడియా ముందు ప్రవేశ పెడతామన్నారు. మావోలకు అప్పారావు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
ఏయు బందుకు పిలుపు
ప్రొఫెసర్ అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు గురువారం ఏయు బందుకు పిలుపునిచ్చాయి. కాగా, మావోయిస్టులు ఎల్లుండి దండకారణ్యం బందుకు పిలుపునిచ్చారు. అప్పారావుకు గిరిజన విద్యార్థులతో తప్ప మావోలతో సంబంధాలు లేవని పలువురు అధ్యాపకులు చెబుతున్నారు. కాగా, అప్పారావు అరెస్టును పలువురు ఖండించారు. వారెంట్ చూపకుండా, కారణాలు లేకుండా అరెస్టు చేయడం సరికాదని వరవర రావు అన్నారు.
ఏయులో ఉద్రిక్తత
అప్పారావు అరెస్టు నేపథ్యంలో ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. రూరల్ ఎస్పీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. అప్పారావును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే యూనివర్సిటీ మొత్తం రోడ్డు మీదకు వస్తుందన్నారు. ఎస్పీ ఆఫీసును విద్యార్థులు ముట్టడించే యత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. తన భర్తను చూపించాలని అప్పారావు భార్య డిమాండ్ చేశారు.
బారాషాహిద్ దర్గా వద్ద ఆనంకు చేదు అనుభవం
మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి బారాషాహిద దర్గా దగ్గర చేదు అనుభవం ఎదురైంది. రొట్టెలపండుగకు వెళ్తుండగా పోలీసులు ఆనం వాహనాన్ని అడ్డుకున్నారు. సాధారణ పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని ఉంచవలసిందిగా సూచించారు. దీంతో పోలీసులతో ఆనం వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు ఆనం వాహనాన్ని లోనికి అనుమతించడంతో వివాదం సర్దుమణిగింది. బారాషాహిద్ దర్గాలో ఆనం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.












Click it and Unblock the Notifications