అయోధ్య వేదికగా.. చంద్రబాబు- మాజీ సీజేఐ ఎన్వీ రమణ మధ్య చర్చలు
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు.. తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాల రాముడిగా కనులవిందుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు.
ఈ మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది. 12:31 నిమిషాలకు పూర్తయింది. మొత్తం 86 సెకెండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని ముగించారు అర్చకులు. అభిజిత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగింది. మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ మాత్రమే గర్భగుడిలోనికి ప్రవేశించారు.
రాములవారికి తొలి పూజలు చేశారు. విగ్రహం కళ్లకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించారు. కాటుకను పూశారు. అయోధ్య ఆలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్, వారణాశి కాశీ విశ్వనాథ ఆలయం ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్.. సారథ్యంలో 121 మంది అర్చకులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ ఉదయం అయోధ్యకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అమర్చిన వీఐపీ గ్యాలరీలో తొలి వరుసలో కూర్చున్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అసాంతం తిలకించారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు. సుమారు అరగంట పాటు మాట్లాడారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పదవీ విరమణ చేసిన అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీలో నివసిస్తోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications