ayodhya ram mandir: తిరుమల టీటీడీ వెంకటేశ్వర భక్తిఛానల్ తరహాలో అయోధ్య రామయ్య ఛానల్!!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. జైశ్రీరామ్ నినాదాలతో దేశవ్యాప్తంగా శ్రీరామ భక్తి పెల్లుబుకుతోంది. ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా, దేశంలో మూడవ అతిపెద్ద ఆలయంగా అయోధ్య రామ మందిరం ముస్తాబవుతోంది. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించి, బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసి అత్యంత ఘనంగా వేడుకను నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూడడానికి దేశం మొత్తం సిద్ధమవుతోంది.
ఇక ఇదే సమయంలో ఇప్పటికే అయోధ్య రామయ్యకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు రాగా తిరుమల వెంకటేశ్వర స్వామి తరహాలో అయోధ్య ఆలయాన్ని తీర్చిదిద్దడానికి సంకల్పించారు ఆలయ ట్రస్టు అధికారులు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజు రాములవారికి విశేష పూజలు, సేవలతో పాటు నిత్యం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కార్యక్రమాలన్నింటినీ దేశ విదేశాలలో ప్రజలకు చూపించే ప్రయత్నం చేయనుంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

తిరుమల వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉన్నట్టుగానే, అయోధ్య రామయ్యకు కూడా భక్తి ఛానల్ ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఉన్నట్టు సమాచారం. అయోధ్య రాముడి కోసం శాటిలైట్ ఛానల్ తీసుకురావాలనే ఆలోచన చేస్తున్న ట్రస్ట్ ఆ పని త్వరలో మొదలుపెట్టనుంది.
ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అయోధ్యకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం, అయోధ్యలో జరుగుతున్న విశేష పూజలకు సంబంధించిన సమాచారాన్ని చానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇప్పటికే అయోధ్యలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. అదే తరహాలో రైల్వే టెర్మినల్, బస్టాండ్ లతోపాటు, ప్రముఖ హోటల్స్ ఏర్పాటు కూడా జరుగుతుంది.
ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు అయోధ్యకు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా అయోధ్య అన్ని హంగులతో సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అయోధ్య రామయ్య కోసం శాటిలైట్ భక్తి ఛానల్ తీసుకురావాలనే ఆలోచన దేశవ్యాప్తంగా హిందువులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని, అయోధ్య రామయ్యని నిత్యం చూసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications