టీటీడీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు..!!
Ayodhya Ram Mandir: శతాబ్దాల నాటి భారతీయుల కల ఇంకొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠను జరుపుకోనుంది.
ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందక్కడ.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. వారంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈ మహోత్కృష్ట ఘట్టాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభమైంది.

టీటీడీ పరిపాలనా భవనం నుంచి అన్నమయ్య ఉత్సవ విగ్రహం ఊరేగింపుతో అఖండ మహాయజ్ఞం మొదలైంది. కళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయం మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళ‌్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు.. 24 గంటల పాటు నిరంతరాయంగా కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తారు.












Click it and Unblock the Notifications