Badvel By Poll Results : మెజార్టీ పైనే వైసీపీ ఫోకస్ - మధ్నాహ్నానికి తుది ఫలితం...!!
సీఎం జగన్ సొంత జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. పట్టణంలోని గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకోసం నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల కమిషన్ జారీచేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటుచేశారు.

జగన్ ఇలాకాలో ఫలితం ఏంటి
ప్రతి కేంద్రంలో ఆర్వో, ఏఆర్వోలకు ఒక టేబుల్ ఏర్పాటుచేశారు. ఆర్వో ఉన్న కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తుస్తారు. ర్యాండమ్ చెకింగ్ కోసం ఒక వీవీ ప్యాట్ కేంద్రం ఏర్పాటుచేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. ఇప్పటివరకు సర్వీసు ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన, దివ్యాంగుల ఓట్లు మొత్తం 235 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి.

అందరి టార్గెట్ వైసీపీనే
ఓట్లు లెక్కించే సమయానికి సర్వీసు ఓటర్ల ఓట్లు అందితే వాటిని కూడా కలిపి లెక్కిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్ నమోదైంది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావటంతో పార్టీలు సైతం ఫలితం పైన ఆసక్తిగా ఉన్నాయి. అధికార వైసీపీ..బీజేపీ..కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీగా చెబుతున్నారు. పోలింగ్ సమయంలో వైసీపీ పైన బీజేపీ నేతలు ఆరోపణలు చేసారు. ఫిర్యాదులు పంపారు.
Recommended Video

మెజార్టీ పైనే వైసీపీ లెక్కలు
ఇదే సమయంలో వైసీపీ నేతలు సైతం బీజేపీని టార్గెట్ చేసారు. టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా పోలింగ్ కేంద్రాల్లో కూర్చున్నారంటూ ఆరోపణలు చేసారు. ఇక, వైసీపీ గతం కంటే ఎక్కువ మెజార్టీ పైనే ఫోకస్ పెట్టింది. 2019 ఎన్నికల్లో 45 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఈ సారి దాని కంటే ఎక్కవ మెజార్టీ సాధిస్తామని చెబుతోంది. తొలి నుంచి తమకు విజయం మీద ఎటువంటి అనుమానం లేదని...తాము భారీ మెజార్టీ కోసమే పని చేస్తున్నామని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. టీడీసీ..జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో..ఇప్పుడు ఇక్కడ వైసీపీ అనుకున్నట్లుగా మెజార్టీ సాధిస్తుందా... బీజేపీ - కాంగ్రెస్ కు బద్వేలు ప్రజలు ఏ స్థాయిలో మద్దతుగా నిలిచారనేది మరి కాసేపట్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications