స్వచ్ఛందంగా: అమరావతిపై బాలకృష్ణ, రాజధానిలో ఆర్టీసీకి 215 ఎకరాలు
అనంతపురం: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూముల విషయమై హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ గురువారం స్పందించారు. రాజధానికి రైతులు భూములు స్వచ్చంధంగానే ఇస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో తాగునీటి సమస్యలు అని ఆరోపించారు. వచ్చే మూడు నెలల పాటు తాను పూర్తిగా నియోజకవర్గం అభివృద్ధి పైనే దృష్టి సారించనున్నట్లు చెప్పారు. లేపాక్షి నంది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు.
అమరావతిలో 215 ఎకరాలు: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ
రాజధాని అమరావతిలో ఏపీ ఆర్టీసీకి 215 ఎకరాలు కేటాయించాలని కోరినట్లు ఏపీఎస్ఆర్టీసీ సాంబశివ రావు గురువారం తెలిపారు. ప్రయాణీకుల కోసం అమరావతిలో రెండు భారీ బస్సు టెర్మినళ్లు నిర్మిస్తామని, అదే విధంగా విజయవాడ తరహాలో 13 జిల్లాల్లో బస్టాండ్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

బడ్జెట్‌లో ఆర్టీసికి రూ.500 కోట్లు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే కొత్త ఏడాదికి 1000 కొత్త బస్సులు ప్రవేశ పెడతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.160 ఆర్థిక నష్టం తగ్గించామన్నారు.
పండగ సీజన్ దృష్ట్యా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీలో పలు జిల్లాలకు 2,698 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడపుతామని వీటిలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.160 కోట్లు నష్టాన్ని తగ్గించినట్లు చెప్పారు. ఆర్టీసీకి అప్పులు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. సంస్థకు చెందిన స్థలాల్లో అభివృద్ధి, సరకు రవాణా చేపట్టడం ద్వారా ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు. రోజు వారీ ఖర్చు తగ్గించుకోవడం ద్వారా కూడా నష్టాలను అధిగమిస్తామన్నారు. ఫిబ్రవరి 18న ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతాయన్నారు.












Click it and Unblock the Notifications