ys jagan ను వణికించే ప్రకటన చేసిన బండి సంజయ్
గత వైసిపి ప్రభుత్వం పైన, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని, ఇతర మతస్తులకు అధికారాన్ని అప్పగించారని దుయ్యబట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
నిలువు నామాలతో ప్రజలకు పంగనామాలు
గత ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. నిలువు నామాలతో ప్రజలకు పంగనామాలు పెట్టారని వెంకటేశ్వర స్వామి పై భక్తి లేని వారు నామాలు పెట్టుకొని టీటీడీ ఆస్తులను దోచేసారని బండి సంజయ్ విమర్శలు గుపించారు. ఎర్రచందనం దోపిడీతో జాతీయ సంపదను దోచుకున్న వీరప్పన్ వారసుల సంగతి తేలుస్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎర్రచందనం స్మగ్లర్లు సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారన్నారు.

బండి సంజయ్ వార్నింగ్
ఆ దొంగలను వదిలిపెట్టే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఎర్రచందనం సహా. శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక కోరుతామని నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
శేషాచల కొండల్లో వేల కోట్ల ఎర్ర చందనం దోపిడీ
ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న దొంగల పాలన పోయిందన్న బండి సంజయ్ ప్రస్తుతం తిరుమలలో నిత్యం గోవిందుడి స్మరణ చేసే సేవకుల పాలన వచ్చిందని పేర్కొన్నారు. గత పాలనలో వీరప్పన్ వారసులు శేషాచల కొండల్లోని జాతీయ సంపదైన ఎర్రచందనం స్మగ్లింగ్ తో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతోపాటు నివేదిక తెప్పించుకుంటామన్నారు.
రెండు కొండల వాడా గోవిందా.. పాలన పోయిందన్న కేంద్ర మంత్రి
నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదన్న కేంద్ర మంత్రి, హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమలను అపవిత్రం చేయడానికి, సొంత ఆస్తులను పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. తిరుమలలో అపచారం చేసినందుకే రెండు కొండల వాడా గోవిందా..గోవిందా అనే పాలన పోయిందని, అరాచక పాలన పీడ విరగడయిందన్నారు. ఏడుకొండల వాడా గోవిందా...గోవిందా.. అని సేవ చేసే రాజ్యం వచ్చిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications