ఏపీలో మందుబాబులకు బంపరాఫర్ - మెట్రో నగరాల తరహాలో, తాజా మార్పులు..!!
ఏపీలో మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (సెప్టెంబర్ 1) కొత్త బార్ల పాలసీ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా సగం బార్లకే టెండర్లు వచ్చాయి. దీంతో, వాటికి లాటరీ తీసి లైసెన్సులు ఖాయం చేసారు. కొత్త బార్ పాలసీ అమల్లో భాగంగా విధించిన కొన్ని నిబంధనలతో మద్యం వ్యాపారులు విభేదిస్తున్నారు. ఇక.. కొత్తగా బార్లు దక్కించుకున్న వారు నేటి నుంచి బిజినెస్ ప్రారంభించారు. ఈ సమయంలోనే బార్ల టైమింగ్స్ పెంచారు. అర్ద్రరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండనున్నాయి.
ఏపీలో నేటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉదయం 10.00 గంటల నుంచి అర్థరాత్రి 12.00 గంటల వరకు బార్లు తెరచి ఉండనున్నాయి. ఈ విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలోని అన్ని ముఖ్య నగరాలలో దాదాపుగా ఇదే విధానం అమలు అవుతోంది. దాంతో ఆ యా నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సైతం చేరినట్లు అయింది. ఈ నూతన బార్ పాలసీ 2025 నుంచి 2028 వరకు అమలులో ఉండనుంది. అయితే గతంలో పాత పాలసీ ప్రకారం.. రాత్రి 11.00 గంటలకు బార్లను మూసి వేయాల్సి ఉండేది. అయితే, నూతన విధానంతో ఒక గంట మేర బార్లను నిర్వహించుకోనే విధానాన్ని నిర్వాహకులకు ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం కల్పించింది.

రాత్రి 12 గంటల వరకు బార్లు నిర్వహించుకునేలా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ఉత్తర్వులు జారీ చేశారు. న్యూఢిల్లీలో బార్లు, రెస్టారెంట్లలో అర్థరాత్రి 1.00 వరకు మద్యం సరఫరా చేస్తారు. అదే విధంగా చెన్నై, హైదరాబాద్, కోల్ కతా లోనూ అర్ద్రరాత్రి 12 గంటలకు బార్లు మూసివేస్తారు.
బెంగళూరులో మామూలు రోజుల్లో రాత్రి 11.30 గంటల వరకు.. వారాంతంలో మాత్రం అంటే.. శుక్ర, శనివారాల్లో అర్థరాత్రి 1.00 గంట వరకు పబ్‌లు తెరచి ఉంచుతారు. బార్ల ద్వారా మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు.. మందుబాబులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా అర్ద్రరాత్రి 12 గంటల వరకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, దరఖాస్తులు రాకుండా మిగిలిన బార్లకు మరో సారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications