బంగాళాఖాతంలో అల్పపీడనం: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా..: ఏపీలో భారీ వర్షాలు
Heavy rains: ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించింది. తమిళనాడు తీరం మీదుగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీ అంటే బుధవారం నాటికి ఈ ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారనుంది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది.

దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు పడొచ్చు. బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చింది.
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని చెప్పారు. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications