Kisan Credit Card కొత్త రూల్స్.. రైతన్నలకు ఆర్బీఐ గుడ్ న్యూస్
దేశంలోని అన్నదాతలకు మరింత సులభంగా, పారదర్శకంగా బ్యాంకింగ్ రుణాలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగు వేసింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) నిబంధనలను సవరిస్తూ శుక్రవారం నాడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడే రైతులకు సకాలంలో, తగినంత పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా సరళమైన పద్ధతుల్లో రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల ప్రక్రియను ఈ కొత్త నిబంధనలు క్రమబద్ధీకరించనున్నాయి.
పంట కాలాల (Crop Seasons) ప్రామాణీకరణ..
తాజా సవరణల ప్రకారం.. రుణాల మంజూరులో స్పష్టత కోసం పంట కాలాల నిర్వచనాన్ని ఆర్బీఐ ప్రామాణీకరించింది. బ్యాంకింగ్ ఆస్తుల వర్గీకరణ (IRAC) నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులు చేశారు. ఇకపై కేసీసీ పథకం కింద..
- స్వల్పకాలిక పంటల (Short duration crops) కాలపరిమితి: 12 నెలలుగా నిర్ధారించారు.
- దీర్ఘకాలిక పంటల (Long duration crops) కాలపరిమితి: 18 నెలలుగా ప్రామాణీకరించారు.
- పంట సాగు ప్రారంభం నుండి, కోతలు పూర్తయి మార్కెటింగ్‌కు వెళ్లే వరకు ఉండే సమయాన్ని 'పంట కాలం'గా పరిగణిస్తారు. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి నుండి అమలులోకి రానున్నాయి.

రూ. 2 లక్షల వరకు కొలేటరల్-ఫ్రీ (పూచీకత్తు లేని) రుణాలు
రైతులకు ఊరటనిచ్చేలా పాత లోన్ లిమిట్‌ను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించింది. కేసీసీ ద్వారా తీసుకునే రూ. 2 లక్షల లోపు వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాలకు ఎలాంటి పూచీకత్తు (Collateral Security) లేదా మార్జిన్ మనీ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, రైతులు తమకు తాముగా ఇష్టపూర్వకంగా బంగారం, వెండి ఆభరణాలను తాకట్టు పెట్టి రూ. 2 లక్షల లోపు రుణం పొందితే.. దాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబోమని ఆర్బీఐ ఒక వెసులుబాటు కల్పించింది. రూ. 2 లక్షలకు పైబడే రుణాలకు మాత్రం బ్యాంకులు తమ అంతర్గత క్రెడిట్ పాలసీల ప్రకారం పూచీకత్తును నిర్ణయిస్తాయి.
రూ. 3 లక్షల వరకు అదనపు వెసులుబాటు
పంటల హైపోథెకేషన్ (hypothecation) లేదా స్టాక్ ఆధారంగా, రికవరీకి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న రుణాల విషయంలో రైతులకు మరింత పట్టు దొరకనుంది. ఇటువంటి ప్రత్యేక సందర్భాలలో రూ. 3 లక్షల వరకు తీసుకునే రుణాలకు కూడా పూచీకత్తును మినహాయించే హక్కును బ్యాంకులకు ఆర్బీఐ కల్పించింది. అంతేకాకుండా, పంట సాగు అవసరాల నిమిత్తం ఇచ్చే స్వల్పకాలిక రుణ పరిమితులను బ్యాంకులు తమ అంతర్గత విధానాల ప్రకారం ఎప్పటికప్పుడు సమీక్షించి, పునరుద్ధరించాలని కేంద్ర బ్యాంకు ఆదేశించింది.
వ్యవసాయం, డైరీ, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ రంగాలలో పెట్టుబడి పెట్టే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఒక ప్రధాన ఆర్థిక వనరుగా నిలుస్తోన్న తరుణంలో, ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ నూతన సంస్కరణలు క్షేత్రస్థాయిలో రైతులకు ఎంతో మేలు చేయనున్నాయి.














Click it and Unblock the Notifications