MBBS Seats: మన దేశంలో ప్రతి 778 మందికి ఒక డాక్టర్
భారతీయ వైద్య విద్య రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో మౌలిక వైద్య సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిపుణులైన డాక్టర్ల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గత రెండేళ్ల వ్యవధిలోనే వేలాది ఎంబీబీఎస్, పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మెరుగుదలతో భారత్‌లో డాక్టర్లు, జనాభా నిష్పత్తి ఎంతో ఆశాజనకంగా మారింది.
భారీగా పెరిగిన ఎంబీబీఎస్, పీజీ సీట్లు!
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గణాంకాల ఆధారంగా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,09,115గా ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య, ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరానికి నాటికి ఏకంగా 1,28,976కు చేరిందని తెలిపారు. అంటే దాదాపు 20 వేల వరకు కొత్త సీట్లు తోడయ్యాయి. ఇదే సమయంలో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన పీజీ సీట్లు కూడా 86,360 స్థాయికి పెరగడం విశేషం.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలను మించిన భారత్!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం ప్రతి 1,000 మంది జనాభాకు కనీసం ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి. కానీ మన దేశంలో ఈ నిష్పత్తి అంతకంటే మెరుగ్గా ఉంటూ 1:778కి చేరిందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం మన వద్ద రికార్డుల ప్రకారం 15.35 లక్షల మంది అల్లోపతిక్ వైద్యులతో పాటు, 7.51 లక్షల మంది ఆయుష్ రంగానికి చెందిన నిపుణులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది రోగులకు సేవలు అందిస్తున్నారని అంచనా వేసినా.. డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన ప్రమాణాల కంటే మెరుగైన స్థానంలో భారత్ నిలిచింది.
ప్రవేశ పరీక్షలపై దృష్టి సారించాల్సిన సమయం!
ఒకవైపు మెడికల్ సీట్ల సంఖ్య పెరుగుతుండటం హర్షణీయమైన అంశమే అయినప్పటికీ, ప్రవేశ పరీక్షల (నీట్) నిర్వహణ, పారదర్శకత విషయంలో తలెత్తుతున్న సందేహాలను కూడా అంతే వేగంగా నివృత్తి చేయాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత నాణ్యమైన, పారదర్శకమైన విద్యను అందిస్తేనే ప్రతిభావంతులైన యువతకు సరైన అవకాశాలు దక్కుతాయి.












Click it and Unblock the Notifications