మళ్లీ తెరపైకి మూడు రాజధానులు..! హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో అమరావతి రాజధాని స్ధానంలో గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం రెండు చట్టాలు చేసింది. వీటిని సవాల్ చేస్తూ అప్పట్లోనే హైకోర్టు (AP High Court), సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. రాజధానుల వ్యవహారంలో ముందుకెళ్లకుండా అప్పటి జగన్ సర్కార్ కు బ్రేకులు వేసింది. ఈ క్రమంలోనే ఆయా చట్టాల్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే అప్పట్లో ఈ చట్టాల్ని సవాల్ చేస్తూ వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లు మాత్రం హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయి.
మరోవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం స్ధానంలో కూటమి సర్కార్ వచ్చాక అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడమే కాకుండా, పార్లమెంట్ లో ఈ మేరకు గతంలో ఆమోదించిన ఏపీ విభజన చట్టంలోనూ మార్పులు చేయించారు. అలాగే గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై కూటమి సర్కార్ తన వైఖరి కూడా చెప్పేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. అయితే హైకోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉన్న మూడు రాజధానుల చట్టం వ్యతిరేక పిటిషన్లు మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పట్లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లు ఇప్పుడు నిరర్ధకం అవుతాయని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో మూడు రాజధానుల స్ధానంలో తిరిగి ఏకైక రాజధానిగా అమరావతికి గుర్తింపు లభించడం, అక్కడ పనులు కూడా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అప్పట్లో దాఖలైన పిటిషన్లపై ఇప్పుడు మరోసారి విచారణ అనవసరమని భావించింది. అయితే సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై ఈ నెల 29న విచారణ జరగనుంది. అక్కడ వచ్చే తీర్పు ఆధారంగా మూడు రాజధానుల వ్యతిరేక పిటిషన్లపై తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకూ ఈ పిటిషన్లపై తదుపరి విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.














Click it and Unblock the Notifications
