బీసీలు, ఎస్సీ,ఎస్టీలు అందరికీ అన్యాయం; జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు : చంద్రబాబు ధ్వజం
టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. వివిధ వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనుడు జగన్ అని పేర్కొన్నారు.

జగన్ ఎస్సీలను నమ్మించి ద్రోహం చేశారు
పార్టీ ఎస్సీ నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఎస్సీలలో యువ నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీల పై దాడులు నిత్యకృత్యంగా మారాయి నిప్పులు చెరిగారు. జగన్ ఎస్సీలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు అని అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మక ద్రోహం చేస్తున్నారని చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించిన వర్గాల పైన జగన్మోహన్ రెడ్డి దాడులు చేయిస్తూ, అరాచకాలకు పాల్పడుతున్నారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ప్రజల్లో జగన్ పాలన పట్ల విముఖత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వందల సంఖ్యలో ఎస్సీల పై దాడులు జరిగాయని అనేక సంఘటనలను ఆయన ఉదాహరించారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన పట్ల ప్రజలలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది అని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ అరాచక పాలన లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎవరికి భద్రత లేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం పై పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు.

బీసీలను అణచివేస్తున్న జగన్ సర్కార్
ఇక నిన్నటికి నిన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం బీసీలను అక్రమ కేసులతో వేధిస్తూ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. 35కు పైగా బీసీలకు అందించే పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని వివరించారు. టిడిపి హయాంలో రాష్ట్రంలో బీసీల కోసం అమలైన పథకాలు జగన్ ఇవ్వట్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలను వైసిపి రాజకీయంగా అణిచి వేస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బిసి జనగణనలోనూ వివక్ష చూపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ నిధులు ఖర్చు చేయక నిర్వీర్యం చేశారని అసహనం వ్యక్తం చేశారు. బీసీల రాజకీయ రిజర్వేషన్లను కూడా కుదించారని చంద్రబాబు పేర్కొన్నారు.

హిందూ మహిళలకు వరలక్ష్మీ వ్రతం , ముస్లిం లకు మొహర్రం పండుగ శుభాకాంక్షలు
ఇదే సమయంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు సకల సౌభాగ్యం ప్రదమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన మహిళలందరికీ మీ వ్రతం ఫలవంతమై ఆ లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదికీ అష్టైశ్వర్యాలను, నిత్య సంతోషాలను, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఈరోజు మొహరం పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాక్షస పాలన ఎదురునిలిచి ధర్మాన్ని ప్రజా హక్కుల ను కాపాడడం కోసం హజరత్ ఇమామ్ హుస్సేన్ తదితరులు చేసిన మహోన్నత త్యాగాలు ముస్లిం మత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతేకాదు మొహర్రం సందర్భంగా సమాజం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీరులను స్మరించుకుందాం అంటూ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు .












Click it and Unblock the Notifications