జగన్‌కు అది నచ్చలేదా: బూరగడ్డ వేదవ్యాస్ టిడిపిలోకి రావడం వెనుక?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ ఝలక్ ఇచ్చారు. ఇప్పటికే వైసిపికి రాజీనామా చేసిన ఆయన ఈ నెల 21న సైకిల్ ఎక్కనున్నారు. సీఎం చంద్రబాబును కలిసి ముహూర్తం కూడా నిర్ణయించారు.
బూరగడ్డ పార్టీని వీడటం వెనుక పలు కారణాలున్నాయని అంటున్నారు. అందులో తుని ఘటన పైన భిన్నంగా మాట్లాడటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. స్వయంగా బూరగడ్డనే తన అనుచరులతో కాపు ఉద్యమం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారట.
తాను కాపు రిజర్వేషన్‌కు అనుకూలమైనా, కాపునేత ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమాన్ని వ్యతిరేకించానని, రైళ్లు తగులబెట్టటం, వాహనాలను కాల్చటం సరికాదని ప్రకటించడంతో జగన్‌కు నచ్చలేదని వాపోయారంటున్నారు. దీంతో తనను పార్టీలో శత్రువుగా మార్చే ప్రయత్నం చేశారన్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల ముందే టీడీపీ తనను ఆహ్వానించిందని, అదే సమయంలో మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావు, తాను కలిసి ఒకేసారి వెళ్దామని యోచించినా చివరకు వారు ముందుగా వెళ్లారని, అనూహ్య పరిస్థితుల్లో తాను వైసిపిలో చేరవలసి వచ్చిందన్నారు. ప్రస్తుతం టిడిపి తిరిగి ఆహ్వానిస్తోందని సముచిత గౌరవమిస్తామని చెబుతోందన్నారు.
ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో 2014 ఏప్రిల్ 14న వైసిపిలోకి వెళ్లి పెడన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను వివరించారు. నియోజకవర్గంలో పార్టీకి ఏజెంట్లు లేని పరిస్థితుల్లో తాను వైసిపి తరపున 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పొందానన్నారు.
అప్పటి నుంచి పార్టీలో సరైన గౌరవం లభించటంలేదని వాపోయారు. కైకలూరులో పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పొందిన ఉప్పాల రాంప్రసాద్‌ను ఇక్కడ కన్వీనర్‌గా నియమించి తనను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇక కంకిపాడులో గతేడాది నిర్వహించిన వైసిపి జిల్లా సమావేశంలో ప్రజాప్రతినిధుల్ని, మాజీ ప్రజాప్రతినిధుల్ని వేదిక పైకి ఆహ్వానించి తనను నిర్లక్ష్యం చేశారన్నారు. నిర్లక్ష్యంపై జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications