కలకలం: దాసరి సహా వారిపై చంద్రబాబు నిఘా పెట్టారా, అంతలేదా?
హైదరాబాద్/విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పైన, దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిఘా పెట్టిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ పోరాటంలో ఆయన పలువురు కాపు నేతలను కలుపుకొని వెళ్తున్నారు. మంగళవారం నాడు దాసరి, ముద్రగడ, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించారు.
ఈ సందర్భంగా దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాము సమావేశమైన హోటల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారని, ఇక్కడ మేం ఏం మాట్లాడుకున్నామో చంద్రబాబు నేరుగా చూడవచ్చునని వ్యాఖ్యానించారు.

దాసరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కాపులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన రిజర్వేషన్ల కోసం తాము పోరాడుతుంటే తమ పైన నిఘా పెట్టారని కాపు నేతలు ఆరోపిస్తున్నారు. తాము ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. రిజర్వేషన్ల కోసం మరింత ఉద్యమిస్తామన్నారు.
మరోవైపు, దాసరి, ముద్రగడల పైన నిఘా పెట్టవలసిన అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కాపులకు ఇచ్చిన హామీ పైన తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉందని, ఆ దిశగా వెళ్తున్నామని, అలాంటప్పుడు ముద్రగడ వంటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, కాబట్టి నిఘా పెట్టవలసిన అవసరం కూడా లేదని చెబుతోంది.
ఇప్పటికే తుని విధ్వంసం కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు టార్గెట్ చేసుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తుని కేసులో ప్రతిపక్ష నాయకులను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు దాసరి కాపు నేతల సమావేశం పైన నిఘా పెట్టారని చెప్పడం గమనార్హం. టిడిపిని ఆత్మరక్షణలో పడేసేందుకే దాసరి ఆ వ్యాఖ్యలు చేశారా లేక ఆయన మాటలు నిజమా అనే చర్చ సాగుతోంది.
కాగా, ముద్రగడ పద్మనాభంకు ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మద్దతుగా నిలిచారు. కానీ వైసిపిదే ముఖ్య పాత్ర. దాసరి నారాయణ రావు కూడా వైసిపికి అనుకూలంగా ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోందని అంటుంటారు.












Click it and Unblock the Notifications