రాష్ట్రపతికి వినతి: ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించండంటూ తెలంగాణ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించండంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్రపతికి విన్నవించారు. ఇదేంటి భద్రాచలం తెలంగాణలో ఉంది కదా.... ఏపీలో ప్రాతినిధ్యం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?
బొల్లారంలో సోమవారం రాష్ట్రపతిని కలిసిన సున్నం రాజయ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలు ఏపీ పరిధిలో విస్తరించి ఉన్న నేపథ్యంలో తనకు ఏపీ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది.

ఏపీ రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో కలిపిన సంగతి తెలిసిందే. ఆ మండలాలను ఏపీలో కలిపినా... వారికి తెలంగాణలోనే ఓట్లు ఉండటం విశేషం.
ఇటీవల జరిగిన తెలంగాణ స్దానిక సంస్ధల ఉప ఎన్నికల్లో ఆ మండలాల ప్రజలు కీలకంగా మారారు. దీంతో ఈ ఏడు మండలాల ప్రజల సమస్యలను తీర్చేందుకు ఎవరూ రాకపోవడంతో ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌తో భేటీ అయిన సున్నం రాజయ్య ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
ఇది ఇలా ఉంటే రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన నక్షత్రవాటిక ఉద్యానవనాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రారంభించారు. అనంతరం సూర్య అనే పేరు గల మొక్కను నాటి నీరు పోశారు.
రాష్ట్రపతి నిలయానికి సమీపంలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. గవర్నర్ నరసింహాన్, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాష్ట్రపతి భవన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంగళవారం సీఎంలకు రాష్ట్రపతి విందు
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీ మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, త్రివిధ దళాల అధికారులను ఆహ్వానించారు. మొత్తం 400 మందికిపైగా ఆహ్వానాలు అందినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications