ఏపీ, తెలంగాణకు నరేంద్రమోడీ గుడ్ న్యూస్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన రైల్వే లైను సికింద్రాబాద్-నడికుడి-గుంటూరు. ఈ మార్గంలో బీబీనగర్-గుంటూరు మధ్య (239 కిలోమీటర్లు) రెండో లైను నిర్మాణానికి కసరత్తులు ప్రారంభమయ్యాయి. కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ డబ్లింగ్ కు ఆమోదం తెలిపింది. మొత్తం నిర్మాణ వ్యయం రూ.2853.23 కోట్లు కాగా అందులో సివిల్ పనులకు రూ.1947.44 కోట్లు, సిగ్నలింగ్, టెలికాం పనులకు రూ.319.62 కోట్లు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు రూ.586.17 కోట్ల మొత్తాన్ని అంచనాగా పేర్కొన్నారు. త్వరలోనే టెండర్లు పిలనున్నారు.
రెండోలైను నిర్మాణంతో ప్రయాణికులతోపాటు బొగ్గు రవాణా, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంటు రవాణా వేగవంతమవుతుంది. విష్ణుపురం, నడికుడి, జాన్ పహాడ్, మేళ్లచెరువు, జగ్గయ్యపేట, రామాపురంలో సిమెంటు పరిశ్రమలున్నాయి. చిట్యాల, నార్కెట్ పల్లిలో ఐరన్, స్టీల్ పరిశ్రమలు ఉండగా, విష్ణుపురంలో థర్మల్ పవర్ ప్లాంట్ కడుతున్నారు. మిర్యాలగూడ, నల్గొండ, నాగిరెడ్డి పల్లిలో ఫుడ్ కార్పొరేషన్ ఇండియా గోదాలున్నాయి. రెండో లైను నిర్మాణంవల్ల వీటన్నింటికీ ఎంతో ఉపయోగం కానుంది.

సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రస్తుతం రెండు రైల్వే మార్గాలున్నాయి. ఒకటి బీబీనగర్-నడికుడి-గుంటూరు మార్గం కాగా, ఖాజీపేట, ఖమ్మం మార్గంలో మరొకటి ఉంది. నడికుడి మార్గంలో విజయవాడకు 336 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రధానంగా చెన్నై, తిరుపతికి దగ్గరిదారి అవుతుంది. వయా నడికుడి, గుంటూరు, తెనాలి మీదగా చెన్నై, తిరుపతి చేరుకోవచ్చు. ఈ మార్గంలో ట్రాక్ సామర్థ్యం 148.25గా ఉంది. రెండోలైనును 150 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా నిర్మించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications