గన్నవరం విమానాశ్రయంలో అతి పెద్ద సంచలనం
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ విమానం ఎయిర్ బస్ 340 వచ్చింది. హజ్ యాత్రికులను తీసుకువెళ్లేందుకు ఇది వచ్చింది. ఈ భారీ విమానానికి సెరిమోనియల్ వాటర్ కానన్ సలైట్‌తో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత భారీ విమానాలు రావడానికి మార్గం సుగమమైంది. ఈ విమానాన్ని చూసేందుకు ప్రజలు విమానాశ్రయానికి తండోప తండాలుగా వస్తున్నారు. సాధారణంగా విమానంలో 200 మంది వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్ బస్ 340లో మాత్రం 300 నుంచి 350 మంది వరకు ప్రయాణం చేయొచ్చు.
జెడ్డాకు వెళ్లిన హజ్ యాత్రికులు
హజ్ యాత్రికులను ఎక్కించుకున్న మొదటి విమానం బయలుదేరి వెళ్లింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ పచ్చ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత తొలిరోజు 322 మంది వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 692 మంది ముస్లిం సోదరులు హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా సౌదీ అరేబియాలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రార్థనామందిరానికి చేరుకుంటారు.

కేవలం మూడు గంటల్లో షిరిడీ
విజయవాడ నుంచి షిరిడీ వెళ్లాలంటూ రైలు మార్గంలోనే 18 గంటల ప్రయాణం పడుతోంది. విమానానికి వెళ్లాలనుకునేవారు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ అవసరం లేకుండా ఇక్కడినుంచే షిరిడీకి విమానం బయలుదేరుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు గన్నవరంలో బయలుదేరి 3.00 గంటలకు షిరిడీ చేరుకుంటుంది. అలాగే ప్రతిరోజు షిరిడీలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. కేవలం రెండుగంటల యాభై నిముషాల్లోనే షిరిడీ చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం ఈ విమానానికి ఉంది. దీనిపై సాయి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications