పెద్దిరెడ్డిని చంద్రబాబు ఓడిస్తారా - కీలక పరిణామాలు...!!
ఏపీలో చిత్తూరు జిల్లా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి వర్సస్ కూటమి అన్నట్లుగా రాజకీయం కనిపిస్తోంది. కుప్పంతో సహా ప్రతీ నియోజకవర్గంలో గెలుపును మంత్రి పెద్దిరెడ్డి భుజస్కందాల పైన వేసుకున్నారు. ఇదే సమయంలో పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఓడిస్తానని చంద్రబాబు శపథం చేసారు. దీంతో..పుంగనూరులో ఎన్నికల రాజకీయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి, గెలుపు ఎవరిదనేది కీలకంగా మారుతోంది.
పుంగనూరు రాజకీయం
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని అత్యంత కీలక నియోజకవర్గం పుంగనూరు. 2009 నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుస విజయాలు దక్కించుకున్నారు. అయితే, గత ఎన్నికలకు భిన్నంగా ప్రస్తుతం ఇక్కడ లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. పుంగనూరుతో పాటుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్దుల గెలుపు బాధ్యత సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి పైనే ఉంచారు. ఇక్కడ సామాజిక వర్గాలవారీగా.. రెడ్డి: 29,563, ముస్లిం: 29,143, బలిజ: 22,039, ఎస్సీ మాల: 21,774, యాదవ: 13,724, వడ్డెర: 11,923, కమ్మ: 8,989, ఎస్సీ మాదిగ: 8,273 ఓట్లు ఉన్నాయి. బోడే రామచంద్రయాదవ్ ఇక్కడ బరిలో ఉన్నారు.

చంద్రబాబు వ్యూహం
బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. వరుస గెలుపు, గ్రామాల్లో బలమైన వర్గం పెద్దిరెడ్డికి కలిసొచ్చే అంశాలు. ప్రతిపక్షాలను వేధిస్తున్నారనే అభిప్రాయం ఉంది. టీడీపీ అభ్యర్ది చల్లా రామచంద్రారెడ్డి వైసీపీకి ధీటుగా పోరాటం చేస్తున్నారు. పెద్దిరెడ్డి లక్ష్యంగా నియోజకవర్గంలో టీడీపీ కేడర్ లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పరంగా ఉద్యమాలు చేసారు. అయితే, అదే సమయంలో నియోజకవర్గానికి దూరంగా నివాసం ఉండటం మైనస్ గా మారింది. మరో అభ్యర్ది బోడే రామచంద్ర యాదవ్ సైతంతన బలం నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు
కలిసొచ్చేదెవరికి
పుంగనూరులో మరోసారి గెలిచి తన పట్టు నిరూపించుకోవాలని పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా పెద్దిరెడ్డి పైన విజయం సాదించాలని టీడీపీ అధినేత పట్టుదలతో ఉన్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే, స్థానికంగా మారుతున్న సమీకరణాలతో ఇక్కడి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. రామచంద్రయాదవ్ కు వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గం సున్నితమైనదిగా గుర్తించింది. ఇక్కడ అదనపు బలగాలను మొహరిస్తోంది. దీంతో, పుంగూనూరులో పోలింగ్, ఎన్నికల ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications