పిఠాపురం నుంచి వర్మ ఔట్ - తాజా ఆఫర్, అక్కడే ట్విస్ట్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమిలో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ తో లెక్కలు మారుతున్నాయి. అక్కడ పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత ఇవ్వక పోవటం పైన ఆయన మద్దతు దారులు ఆందోళన చేస్తున్నారు. వర్మకు ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు హామీ సైతం అమలు కాలేదు. ఈ సమయంలోనే వర్మకు కొత్త ఆఫర్ సంచలనంగా మారుతోంది. దీని పైన ఇప్పుడు వర్మ నిర్ణయం ఏంటి. పిఠాపురంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది.
నాగబాబు ఎంట్రీతో
పిఠాపురం లో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పర్యటించారు. ఎమ్మెల్సీ అయిన తరువాత తొలి సారి పిఠాపురంలో నాగబాబు పర్యటన సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వర్మ మద్దతు దారులు నిరసనలకు దిగారు. నాగబాబు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాగబాబు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్సీగా ఏ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేదీ అధికారికంగా నాగబాబు అసెంబ్లీ వర్గాలకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో, ఏ హోదాలో నాగబాబు తాజా గా పిఠాపురంలో అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారనే ప్రశ్న వినిపిస్తోంది. ఇదే సమయంలో వర్మను కలుపుకొని వెళ్లకపోవటం మరో రచ్చగా మారింది.

అమలు కాని హామీ
జనసేన ప్లీనరీ వేదికగా వర్మ పైన పరోక్షంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇవి వర్మ మద్దతు దారులకు నచ్చ లేదు. నాగబాబు పైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, పిఠాపురం సీటు వర్మ త్యాగం చేసిన సమయంలో ఆయనకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి నుంచి పలువురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వగా.. వర్మకు మాత్రం దక్కలేదు. ఇదే సమయంలో వర్మను తిరిగి పిఠాపురం నుంచి పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా వివాదం పైన అటు వర్మ, ఇటు జనసేన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ సమయంలోనే వర్మ సన్నిహితుల నుంచి అనూహ్య ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది.
వర్మకు తాజా ఆఫర్
పిఠాపురం నుంచి పవన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. భవిష్యత్ లోనూ పవన్ ఆ సీటు నుంచే కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ ప్రతినిధిగా ఇక నాగబాబు పిఠాపురం వ్యవహారాలను పర్యవేక్షిస్తారనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఇక.. టీడీపీ కేడర్ ఉన్నా.. పవన్ కోసం పని చేయాల్సి ఉంటుందనే సంకేతాలు క్లియర్ గా ఉన్నాయి. ఈ సమయంలో వర్మ ఇక పిఠాపురం నుంచి తన రాజకీయ భవిష్యత్ కోసం కూటమిలో పోరాటం చేయలేరనే చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. గతం లో వర్మ 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పిఠాపురం నుంచి విజయం సాధించారు. అయితే, ఇప్పుడు తిరిగి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఇదే సమయంలో వర్మ వైసీపీలోకి వెళ్తారంటూ కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇక పవన్ కోసం
అయితే, వర్మ ప్రస్తుత పరిస్థితుల్లో డైలమాలో కనిపిస్తున్నారు. గతంలో ఆయనకు జిల్లా రాజకీయా ల్లో టీడీపీలో సీనియర్ నేత యనమల మద్దతు ఉండేది. ఇప్పుడు యనమల సైతం దాదాపుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో.. నామినేటెడ్ పదవి ఇచ్చే వరకూ వేచి చూడాలని కొందరు పార్టీ నేతలు వర్మకు సూచిస్తున్నారు. హామీ ఇచ్చినట్లుగా వర్మకు ఎమ్మెల్సీ పదవి మాత్రం దక్కటం కష్టమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో ఏడాదిలో నియోజకవర్గా ల పునర్విభజన జరగనుంది. ఆ సమయంలో ఒక నియోజకవర్గ బాధ్యతలు వర్మకు కేటాయించే లా తాజా సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, కూటమి కొనసాగుతుందని పవన్ తో టీడీపీ ముఖ్య నేతలు పదే పదే చెబుతున్నారు.
వర్మ వాట్ నెక్స్ట్
కొత్త నియోజకవర్గాల పైన ఇప్పటికే జిల్లాలో చర్చ మొదలైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. కాగా, కూటమిలోని మూడు పార్టీల నేతలు ఈ నియోజక వర్గాల పెంపు స్థానాల పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. పిఠాపురం వర్మకు కంచుకోటగా ఉండగా.. కొత్త స్థానంలో పరిస్థితుల పైన అంచనా వేయలేకపోతున్నారు. పవన్ గెలుపుకు సహకరించిన వర్మ కు ప్రాధాన్యత లేకుండా.. స్పష్టత ఇవ్వకుండా చేయటం ఆయన మద్దతు దారులకు రుచించటం లేదు. దీంతో, ఇప్పుడు వర్మ కొంత కాలం వేచి ఉండే ధోరణితో కొనసాగాలని భావిస్తున్నారు. జిల్లా లో రాజకీయంగా చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో వర్మ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ సమయంలో టీడీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసు కుంటుందనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. అటు వైసీపీ సైతం పిఠాపురం పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. మరి కొద్ది రోజుల్లో పిఠాపురం కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చసుకొనే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications