భోలా శంకర్ టికెట్ రేట్లపై భారీ ట్విస్ట్ ! అందుకే చిరు విమర్శలు ? ఏపీ మంత్రి పరోక్ష వ్యాఖ్యలు..!
ఏపీలో చిరంజీవి నటించిన భోలా శంకర్ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రదర్శించే థియేటర్లు, మల్టీప్లెక్స్ ల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రపురంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాము అడిగిన పత్రాలు చిత్ర యూనిట్ సమర్పించలేదన్నారు.
ఏపీలో 100 కోట్ల పైన బడ్డెట్ తో నిర్మించే చిత్రాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాన్ని నిర్మాతలు అనుమతి కోరాల్సి ఉంది. దీంతో దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన చిరంజీవి తాజా చిత్రం భోలా శంకర్ నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. అయితే ప్రభుత్వం బడ్డెట్ కు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు 12 అభ్యంతరాలను నిర్మాతల ముందు ఉంచింది. వీటికి సమాధానం చెప్పే విషయంలో వారు మౌనం వహించారు. దీంతో ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఇదే అంశంపై ఇవాళ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. రేపు భోలా శంకర్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో వేణు టికెట రేట్ల పెంపు వివాదంపై మాట్లాడారు. చిరంజీవి తాజాగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దీంతో చిరంజీవి విమర్శలపై ఆగ్రహంతోనే భోలా శంకర్ టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం లేదన్న చర్చపై మంత్రి వేణు స్పందించారు. చిరు వ్యాఖ్యలకూ, భోలా శంకర్ రేట్ల పెంపు అనుమతి నిరాకరణకూ సంబంధం లేదన్నారు.
ఆగస్టు 2న చిత్ర నిర్మాతలు తమను సంప్రదించారన్నారు.

ఆగస్టు 2న భోలా శంకర్ చిత్ర నిర్మాతలు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరారని, అయితే తాము 12 అభ్యంతరాలు లేవనెత్తామని సినిమాటోగ్రఫీ మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వీటికి నిర్మాతలు ఇప్పటివరకూ సమాధానం ఇవ్వలేదన్నారు. చిరు వ్యాఖ్యలు చేసింది ఆగస్టు 8న అని ఆయన గుర్తుచేశారు. ఇదంతా చూస్తుంటే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వలేదన్న అక్కసుతోనే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications