మోడీ, షా వాడకం మాములుగా ఉండదుగా..!!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమి మిత్రుల సమావేశంలో పాల్గొనడానికి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. సమావేశంలో ప్రధానమంత్రి వెనకవైపే కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) మిత్రులుగా పరిగణించలేదని, పవన్ ఒక్కడినే పరిగణనలోకి తీసుకుందని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే పవన్ భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి జనసేనానిని బీజేపీ ఏనాడూ మిత్రుడిగా పరిగణించలేదు. మిత్రగౌరవం ఇవ్వలేదు. ప్రధానమంత్రి, అమిత్ షా పర్యటనల సమయంలో కూడా ఆహ్వానం అందలేదు. అటువంటిది ఢిల్లీకి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించడం ఏమిటా? ఏం జరుగుతోంది? అని విశ్లేషకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఊరకరారు మహానుభావులు అన్నట్లుగా కేంద్రంలో మోడీ, అమిత్ షా ఏది చేసినా రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంటుంది అనేది రాజకీయవర్గాల్లో వినిపించే మాట.

క్షేత్రస్థాయిలో బలం లేదు.. ఒకవేళ అకస్మాత్తుగా ఎన్నికలు జరిగితే గట్టిగా నిలబడటానికి కూడా అభ్యర్థులు లేరు.. బూత్ కమిటీలు లేవు.. మండల కమిటీలు లేవు.. ఇంటింటికీ తిరిగే యంత్రాంగం లేదు.. సభ్యత్వమే జరగడంలేదు.. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలయ్యారు.. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే వైసీపీలోకి ఫిరాయించారు.. 2019 నుంచి పొత్తులోనే ఉన్నా.. స్నేహితులుగానే కొనసాగుతున్నా ఈ రెండు పార్టీలు బలపడిందికూడా లేదు.. ఒకరి బలం మరొకరికి స్పష్టంగా తెలుసు. అయినా పవన్ కు గౌరవం, మర్యాద, మంచి ఆదరణ లభించాయి. దీనికి కారణం..
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవడంతో దక్షిణాదిలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పవన్ కల్యాణ్ కు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. ఎక్కడ ప్రచారం నిర్వహించినా భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరవుతారు. పవన్ కు ఉన్న ఇమేజ్ ను రెండు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి పవన్ కు మంచి ఆదరణ దక్కడానికి ఇదే ప్రధాన కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications