టీడీపీ, బీజేపీ సీట్లలో మరోసారి మార్పులు - అభ్యర్దుల్లో టెన్షన్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. మూడు పార్టీల కూటమిలో సీట్ల పైన స్పష్టత వచ్చినా..మరోసారి మార్పులు తప్పేలా లేవు. పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే ఆ పార్టీ తమ అభ్యర్దులను ప్రకటించింది. అనపర్తి, నర్సాపురం స్థానాల పైన చర్చలు జరిగాయి. ఇదే సమయంలో విశాఖ ఎంపీ స్థానం పైన తాజాగా బీజేపీ నుంచి చంద్రబాబు పైన ఒత్తిడి పెరుగుతోంది. మరి..చంద్రబాబు నిర్ణయం ఏంటి.
సీట్లు పాట్లు
ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇదే సమయంలో పూర్తయినట్లే కనిపించిన కూటమి సీట్ల పంచాయితీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ స్థానం తొలి నుంచి తమకు కేటాయించాలని బీజేపీ కోరుతోంది. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు అనకాపల్లి సీటు బీజేపీకి ఇచ్చి..విశాఖ నుంచి భరత్ ను అభ్యర్దిగా ప్రకటించారు. కానీ, బీజేపీ నేతలు ఇప్పుడు మరోసారి విశాఖ సీటు కోసం ఒత్తిడి పెంచారు. బీజేపీ అధినాయకత్వం తోనూ సంప్రదింపులు ప్రారంభించారు. దీని కోసం బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని..పోటీ చేయకపోతే అక్కడ పార్టీ పట్టు కోల్పోతుందనేది వారి వాదన.

విశాఖ పై బీజేపీ పట్టు
విశాఖ కేంద్రంగా బీజేపీ జమ్మలమడుగు, నర్సాపురం పార్లమెంట్ వంటి చోట మార్పులు జరుగున్నప్పుడు వైజాగ్ ను కూడా మార్చాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాక ఎంపీ సీటును జీవీఎల్ కు కేటాయించాలని తీర్మానం చేసారు. మూడేళ్లుగా విశాఖలోనే నివాసం ఉంటూ ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంట్ దృష్టికి తెచ్చారని, ఆయనకు టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కూటమికి, పొత్తుకు మేము వ్యతిరేకం కాదు అంటూనే విశాఖ లోక్‌సభకు పోటీ చేయకుంటే పార్టీ రాష్ట్రంలో చచ్చిపోయినట్టే అంటూ వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగును బీజేపీకి మార్చి కడప లోక్ సభ ఇస్తున్నప్పుడు విశాఖ లోక్ సభ ను కూడా మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
చంద్రబాబు నిర్ణయం ఏంటి
ఇదే డిమాండ్ తో కొందరు నేతలు ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధినాయకత్వం వద్ద తమ వాదన వినిపించేందుకు సిద్దమయ్యారు. అయితే, విశాఖ సీటు వదులుకొనేందుకు చంద్రబాబు సిద్దంగా లేరని తెలుస్తోంది. పొత్తు లో భాగంగా నర్సాపురం స్థానం బీజేపీ అభ్యర్దిగా శ్రీనివాస వర్మకు కేటాయించారు అక్కడ నుంచి రఘురామ రాజు సీటు ఆశించారు. రఘురామ రాజుకు సీటు కోసం చంద్రబాబు ప్రయత్నించారు. సీటు మార్పు పైన ప్రతిపాదన చేసారు. బీజేపీ అంగీకరించలేదు. దీంతో, ఇప్పుడు రఘురామను ఎమ్మెల్యేగా ఉండి నుంచి పోటీ చేయించేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. ఈ క్రమంలో విశాఖ సీటు నుంచి భరత్ ప్రచారం కూడా ప్రారంభించటంతో బీజేపీకి ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. బీజేపీ ముఖ్య నేతలు పట్టుబడితే చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications