బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది- ఇక తేల్చాల్సింది చంద్రబాబే..!!
ఏపీలో ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ కూటమితో కలుస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ - వామపక్షాల కూటమి రంగంలోకి దిగుతోంది. బీజేపీ రెండు రోజుల పాటు విజయవాడ కేంద్రంగా నిర్వహించిన సమావేశంలో అభ్యర్దుల ఎంపిక కసరత్తు పూర్తి చేసింది. పొత్తుల పైన ఇప్పటికే ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఇక, చంద్రాబు చేతిలోనే నిర్ణయం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
పొత్తుల లెక్కలు: ఏపీలో పొత్తుల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. టీడీపీ, జనసేన కూటమి తమతో బీజేపీ ఖాయంగా కలిసి వస్తుందని భావించాయి. కానీ, బీజేపీ తీరు సందేహాలకు కారణమవుతోంది. గత నెలలోనే ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే పొత్తు ఖాయమనే వార్తలు వచ్చాయి.

నెల రోజులు అవుతున్నా..పొత్తు పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఆర్ఎల్డీ పార్టీ ఎన్డీఏలో చేరింది. సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పొత్తుల పైన మాత్రం బీజేపీలో కదలిక కనిపించటం లేదు. తాజాగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు చేసారు. కంేద్ర నాయకత్వానికి ప్రతిపాదిత జాబితా పంపారు.
బీజేపీ వరుస నిర్ణయాలు: ఇటు పురందేశ్వరి ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన పైన పార్టీ నేతలతో సామావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ నాయకుడు శివ ప్రకాష్‌తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు సాగిందీ సమావేశం. ఒక్కో అసెంబ్లీ స్థానానికి ముగ్గురు, పార్లమెంట్ సీటుకు ఇద్దరి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తుల పైన మాత్రం బీజేపీ అధినాయకత్వానిదే తుది నిర్ణయమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

కొనసాగుతున్న సస్పెన్స్: తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అభ్యర్దుల ఎంపిక, మేనిఫెస్టో పైన బీజేపీ కసరత్తు చేయటంతో అసలు పొత్తు ఉండా లేదా అనే సస్పన్స్ రెండు పార్టీల్లోనూ కొనసాగుతోంది. ఈ నెల 6న బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఆ సమయంలో టీడీపీ, జనసేనతో పొత్తు పైన బీజేపీ నేతలు స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.
బీజేపీ అడుగులు చూస్తుంటే పొత్తు లేదనే అభిప్రాయం బలంగా కలుగుతోంది. కానీ, టీడీపీ నేతలు మాత్రం 2014 తరహాలో పొత్తులు ఉంటాయని ధీమాగా చెబుతున్నారు. దీంతో..పవన్ ఇప్పుడు బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇన్ని లెక్కలతో అసలు బీజేపీ అధినాయకత్వం,చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications