బీజేపీ Vs టీడీపీ: మోడీ, పవన్ కళ్యాణ్ లేకుంటే అధికారంలోకి వచ్చేవారా?
అమరావతి: ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశంపై మిత్రపక్షమైన బీజేజీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య తదితరులు టీడీపీ వైఖరిపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పిన నేపథ్యంలో బీజేపీపై రాష్ట్రంలోని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ రెడ్డి మాట్లాడుతూ అసలు తమతో పొత్తు పెట్టుకోమని తామెవరినీ పిలవలేదని కాస్తంత వ్యంగ్యం ప్రదర్శించారు.
అంతేకాదు గడచిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించగానే ఆయనకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నాయకులే పొత్తు కోసం మా వెంటపడ్డారని అన్నారు.

మోడీ ఇమేజ్, పవన్ కల్యాణ్ మద్దతు లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదని దుయ్యబట్టారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరు పొమ్మంటున్నారు? వాజ్ పేయి ప్రధానిగా ఉండగా మిత్రధర్మాన్ని పాటించి రాష్ట్రంలో, కేంద్రంలో మధ్యంతర ఎన్నికలకు బీజేపీ వెళ్లిందని చెప్పుకొచ్చారు.
ఆ ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీ కారణంగానే అధికారం కోల్పోయామని మాపై నిందలు వేసి టీడీపీ తప్పుకుందని విమర్శించారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి దేశవ్యాప్తంగా మోడీకి పెరుగుతున్న ఆదరణను చేసి తగుదునమ్మా అంటూ వచ్చి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని సురేశ్ రెడ్డి టీడీపీపై దుమ్మెత్తిపోశారు.












Click it and Unblock the Notifications