ఏపీలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు - ఎవరెక్కడ..!!
ఏపీలో పొత్తుల లెక్కలపై స్పష్టత వచ్చింది. మూడు పార్టీలు కూటమిగా పోటీకి సిద్దమయ్యాయి. సీట్ల పైన ఒక అవగాహనకు వచ్చాయి. బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాల పైన ప్రాధమికంగా ఒప్పందం జరిగింది. ఈ సంఖ్యకు అనుగుణంగా నియోజకవర్గాల ఖరారు పైన బీజేపీ ముఖ్య నేత శివప్రకాశ్ జీ అమరావతిలో చంద్రబాబు, పవన్ తో సమావేశం కానున్నారు. బీజేపీ ఇప్పటికే పోటీ అభ్యర్దుల పై నిర్ణయానికి వచ్చింది. ఇక, అధికారికంగా ప్రకటనకు సిద్దం అవుతోంది.
బీజేపీ అభ్యర్దులు ఖరారు
ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాల పైన దాదాపు క్లారిటీ వచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులను ఫైనల్ చేసింది. అధికారికంగా ప్రకటన చేసేందుకు బీజేపీ ముఖ్య నేత శివప్రకాశ్ జీ అమరావతికి వస్తున్నారు. మిత్రపక్షాల పార్టీల అధినేతలతో సమావేశం కానున్నారు. బీజేపీకి కేటాయించే స్థానాల్లో రెండు, మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది. బీజేపీకి కేటాయించే స్థానాల పైన చంద్రబాబు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. స్థానిక నాయకత్వం అభ్యర్ధన మేరకు మార్పుల పైన చంద్రబాబుతో శివప్రకాశ్ చర్చలు చేయనున్నారు. బీజేపీ తాము పోటీ చేసే స్థానాల్లోనే సామాజిక సమీకరణాల అమలుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా..మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని రాజంపేట నుంచి ఖరారు చేసారు. తిరుపతి నుంచి కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ లేదా ఆమె కుమార్తె నీహారిక పోటీకి దిగనున్నారు.

ఎవరికి ఎక్కడ ఛాన్స్
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం స్థానం నుంచి పోటీ ఖాయమైంది. 2014లో బీజేపీ విజయం సాధించిన నరసాపురం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే, ఇదే సమయంలో కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి , నరేంద్ర వర్మ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఎవరికి అవకాశం లభిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ గతంలో విజయం సాధించిన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని అరకు స్థానం నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్దులను దాదాపు ఎంపిక చేసింది. అల్లూరి జిల్లా పాడేరు(ఎస్టీ) ఉమామహేశ్వరరావు పేరు ఖరారు కానుంది.
వచ్చే వారం ప్రకటన
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం విష్ణుకుమార్ రాజు, పి. గన్నవరం(ఎస్సీ) నుంచి అయ్యాజీ వేమ, కైకలూరు కామినేని శ్రీనివాస్ లేదా తపన చౌదరి, గుంటూరు పశ్చిమ వల్లూరు జయ ప్రకాశ్, ధర్మవరం వరదాపురం సూర్యనారాయణ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. బీసీల్లో పీవీఎన్ మాధవ్(విశాఖ), మట్టా ప్రసాద్(కృష్ణా), పాకా సత్యనారాయణ (పశ్చిమ గోదావరి) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే... అభ్యర్థుల ఎంపికపై కూటమిలోనూ చర్చ జరుగుతుందని, కచ్చితమైన విజయావకాశాలున్న వారికే టికెట్ ఇస్తారని తెలుస్తోంది. ఈ సీట్లు..అభ్యర్దుల పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.












Click it and Unblock the Notifications