ఏపీ బీజేపీ చీఫ్ గా పులివెందుల నేత - మోదీ మార్క్ ఎంపిక..!!
ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు ఖరారయ్యారు. బీజేపీ అగ్ర నాయకత్వం ఏపీలో అమలు చేస్తున్న కొత్త వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకుంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అప్పగించా లని నిర్ణయించింది. టీడీపీ - జనసేన తో పొత్తు కొనసాగుతున్న వేళ రెడ్డి సామాజిక వర్గం పైన పార్టీ నాయకత్వం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా జగన్ సొంత జిల్లా నుంచే పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసినట్లు సమాచారం.
కొత్త అధ్యక్షుడిగా
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఖరారయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సొంతంగా బలోపేతం కావటం పైన కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంతో, ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీ పడ్డారు. అయితే, తొలి నుంచి పార్టీ కోసం పని చేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.

తొలి నుంచి ఆరెస్సెస్ లో
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఖరారు అయినట్లు తెలుస్తున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డి కడప వాసి. పులివెందుల సమీపంలోని వేంపల్లె స్వస్థలం. 1978 నుంచి ఆరెస్సెస్ లో పని చేస్తున్నారు. కాలేజీ అధ్యక్షుగానూ పని చేసారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019 లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసారు. కిసాన్ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహన - ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్ గానూ రామచంద్రారెడ్డి పని చేసారు. పలు రైతుల సమస్యల పైన పోరాటాలు చేసారు.
సామాజిక సేవలో
రైతు సేవా సమితి ఏర్పాటు చేసి ఇరిగేషన్ సౌకర్యం కల్పించారు. కడప రిమ్స్ ఆస్పత్రికి మూడేళ్ల పాటు మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేసారు. పలు రైతు సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. పసుపు రైతులకు మద్దతు ధర కోసం దీక్షలు నిర్వహించారు. కాగా, బీజేపీ నాయకత్వం పార్టీలో తొలి నుంచి పని చేసిన వారికి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి గా శ్రీనివాస వర్మ ను ఎంపిక చేసిన విధంగానే .. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి విషయంలోనూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సింగారెడ్డి శ్రీనివాస రెడ్డి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అధికారికంగా పార్టీ నాయకత్వం ప్రకటన చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications