తెరాస ట్విస్ట్: పొత్తులపై బిజెపి ధీమా, బాబు డైలమా
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తు విషయమై ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పోటీ చేస్తారనే విషయం దాదాపు తేలిపోయింది. అయినప్పటికీ సీట్ల విషయమై ప్రతిష్టంభన నెలకొనడంతో ఆఖరు నిమిషంలో పొత్తు బెడిసి కొట్టే అవకాశాలు లేకపోలేదు.
టిడిపి, బిజెపిలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని మొదటి నుండి భావిస్తున్నాయి. అందరికంటే ముందే ఈ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని తెలిసినప్పటికీ... ఇప్పటికీ సీట్ల విషయమై లెక్క తేలడం లేదు. తెలంగాణ బిజెపి, సీమాంధ్ర బిజెపిలు కోరుతున్న సీట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో బిజెపి, టిడిపిల మధ్య పొత్తుపై ప్రతిష్టంభన నెలకొంది.

తెలంగాణలో 45 సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధమయ్యాని, బిజెపితో తమ పార్టీ పొత్తు ఖరారయిందని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు మధ్యాహ్నం చెప్పారు. అయితే, పొత్తు ఇంకా ఖరారు కాలేదని బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీ నారాయణ వేర్వేరుగా చెప్పారు.
బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఒకింత ఘాటుగానే స్పందించారు. చర్చలు పెళ్లి చూపుల వంటివని, నచ్చితే పొత్తు ఉంటుందని లేదంటే లేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పొత్తుపై చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. అయితే, బిజెపి మాత్రం తాము కోరినన్ని సీట్లు ఇస్తేనే పొత్తుకు సై అంటోంది. సీమాంధ్రలోను బిజెపి సీట్ల కోసం పట్టుబడుతోంది.
టిడిపి కాదంటే తెరాస సిద్ధం
పొత్తులపై టిడిపితో బిజెపి చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు తెరాస కమలం పార్టీతో టచ్‌లో ఉందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి లేదా కాంగ్రెసు పార్టీతో వెళ్తేనే తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని తెరాస భావిస్తోందట. అందుకే పొత్తు కోసం ఎదురు చూస్తోందని అంటున్నారు. టిడిపితో పొత్తు వ్యవహారం కొలిక్కి వస్తే తెరాస-బిజెపి పొత్తు తేలుతుంది. సీట్ల విషయంలో లెక్క కుదరక టిడిపి దూరమైతే బిజెపికి తెరాస సిద్ధంగా ఉందంటున్నారు.
కాంగ్రెస్, సిపిఐ పొత్తు కుదిరినా...
కాంగ్రెసు, సిపిఐ పార్టీల మధ్య పొత్తు కొలిక్కి వచ్చింది. అయితే, తమకు కేటాయించిన సీట్ల పైన సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సిపిఐకి ఒక లోకసభ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెసు అంగీకరించింది.
ఖమ్మం లోకసభతో పాటు మునుగోడు, వైరా, కొత్తగూడెం, బెల్లంపల్లి, పినపాక, దేవరకొండ, స్టేషన్ ఘనపూర్, మహేశ్వరం, బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గాలు సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెసు సుముఖంగా ఉందట. అయితే, తమకు హుస్నాబాద్ కావాలని సిపిఐ పట్టుబడుతోంది. ఓడిపోయే బహదూర్ పురా తమకు ఎందుకని, హుస్నాబాద్ ఇవ్వాలని చెబుతోంది.
కాంగ్రెస్, తెరాస మధ్య దోబూచులాట
పొత్తు విషయం తెరాస, కాంగ్రెసు పార్టీల దోబూచులాట ఆడుతోంది. తెరాసకు పొత్తు కోసం ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. అదే సమయంలో తెరాస నేతలు మాత్రం తాము ఒంటరిగా వెళ్తామన్నారు. అయితే, సీనియర్ నేత కెకె నివాసంలో హరీష్ రావు, నాయిని నర్సింహ రెడ్డి తదితరులు భేటీ అయి పొత్తుల అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
సర్వేల లొల్లి
రాష్ట్రంలో రెండు రోజులుగా పార్టీల మధ్య సర్వేల లొల్లి నడుస్తోంది. ఎన్టీవి నీల్సన్ ఓఆర్జీ మార్గ్ సర్వే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సిఎం రమేష్ మంగళవారం నిప్పులు చెరిగారు. తప్పుడు సర్వేలని మండిపడ్డారు. బుధవారం చంద్రబాబు కూడా టీవి ఛానళ్లను హెచ్చరించారు. అదే సమయంలో సిఎన్ఎన్ఐబిఎన్ సర్వే టిడిపికి అనుకూలంగా ఉండటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి దానిని తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications