అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సీఈఓ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానం.. అర్హతలు ఇవే..
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రఖ్యాత అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మరోవైపు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక ప్రకటన చేసింది. ట్రస్ట్ సీఈఓ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా సోమవారం ఒక ప్రకటనను పోస్టు చేసింది. ఆలయంలో మేనేజ్ మెంట్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలను చూసేందుకు సీఈఓ పదవికి అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తోంది.
ఈ పదవికి కొన్ని అర్హతలను నిర్దేశించింది. దరఖాస్తుదారునికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ తప్పనిసరిగా ఉండాలని అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ విభాగంలో కనీసం 20 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తుదారుడు కచ్చితంగా హిందువు అయి ఉండాలి. వైష్ణవ సంప్రదాయానికి చెంది, శ్రీ రాముడి భక్తుడు అయిన వారు సరైన అభ్యర్థులుగా పరిగణిస్తాం అని దరఖాస్తు ఫామ్ లో పేర్కొన్నారు. విద్యార్హత, అనుభవంతోపాటుగా దరఖాస్తుదారుడికి సమగ్రత, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు సమృద్ధిగా ఉండాలి.

అధికారిక ప్రకటన ప్రకారం.. సీఈఓ కాలవ్యవధి మూడేళ్లు. అప్లై చేసుకునేందుకు జూలై 18 చివరి తేదీ అని నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఇక 50 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జీత భత్యాలు పరస్పర చర్చల ద్వారా నిర్ణయిస్తామని వెల్లడించింది. ఇక ఇదే విషయంపై విశ్వ హిందూ పరిషత్ స్పందిస్తూ.. సీఈఓ అపాయింట్ మెంట్ కు తాము వ్యతిరేకం కాదని తెలిపింది. కానీ ఈ ప్రక్రియలో ప్రభుత్వ జోక్యం చేసుకోకుండా కేవలం ఆలయ ట్రస్ట్ మాత్రమే వ్యక్తిగతంగా జరపాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications