బెంగళూరులో భారీ వర్షాలు- మరో మూడు రోజుల పాటు: కర్ణాటకలోని ఈ జిల్లాల్లో
నైరుతి రుతుపవనాలు మళ్లీ క్రియాశీలకంగా మారాయి. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక ప్రజలకు భారీ వర్షాలు ఊరటనిస్తోన్నాయి. బెంగళూరు సహా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బెంగళూరుతో పాటు కోస్తా తీరం, కర్ణాటక ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బెంగళూరులో ఈ ఉదయం నుంచే ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో కమ్ముకుని కనిపించింది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. నగరవ్యాప్తంగా విస్తారంగా కురిసింది. దాదాపుగా రెండు గంటల పాటు దంచి కొట్టింది. బసవేశ్వరనగర, బసవనగుడి, శేషాద్రిపురం, సదాశివనగర, మెజెస్టిక్, మంజునాథనగర, విజయనగర, గాంధీనగర, కేఆర్ సర్కిల్, రాజాజీనగర, యశ్వంత్ పూర్, హొసహళ్లి, విద్యారణ్యపుర, యలహంక, హెబ్బాళ, శ్రీరామపుర, మల్లేశ్వరం, జాలహళ్లి.. ఇలా దాదాపుగా నగరం మొత్తం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.

నిన్న, మొన్నటివరకు ఓ మంచి వర్షం నమోదు కాలేదు బెంగళూరు. ఆకాశం మేఘావృతమై కనిపించినప్పటికీ.. దానికి అనుగుణంగా గట్టి వర్షం పడలేదు. ఇప్పుడా కొరతను తీర్చేలా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురిశాయి. ఫలితంగా ప్రధాన రహదారులపై పలుచోట్ల వర్షపు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. మేఖ్రీ సర్కిల్, కేఆర్ పురం, కేఆర్ మార్కెట్, గురగొంట పాళ్య.. వంటి ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
ఈ వర్షాలు బెంగళూరుకే పరిమితం కాలేదు. అటు కర్ణాటక తీరప్రాంత జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, చామరాజనగర, కొడగుతో పాటు పశ్చిమ కనుమల పరిధిలోని శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన్‌లలో కూడా ఏకధాటిగా కురిశాయి. కర్ణాటక ఉత్తర ప్రాంతం పరిధిలోని బెళగావి, గదగ్, విజయపుర, బళ్లారి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
కోలార్, తుమకూరు, చిక్కబళ్లాపూర్, మైసూర్, మండ్య, బాగల్‌కోట్, బీదర్, కలబురగి, యాద్గిర్, రాయచూర్, కొప్పల్, ధార్వాడ జిల్లాల్లో ఈ నెల జూలై 20 వరకు ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన చాలా ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగనుందని ఐఎండీ సూచించింది.












Click it and Unblock the Notifications