బీజేపీ "మెగా" ప్లాన్ : జనసేన - టీడీపీ పొత్తుకు బ్రేక్ వేసేలా : ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం..!!
ఏపీలో బీజేపీ రాజకీయంగా పావులు కదుపుతోంది. తాము అధికారంలోకి రావటం కంటే.. తమ ప్రత్యర్ధులు అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా.. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తనదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ - జనసేన- టీడీపీ కలిసి వైసీపీ ఓడించేందుకు జత కట్టాలనేది జనసేనాని ఆలోచన.
అయితే, గతంలో మాదిరిగా కేవలం పొత్తుకే పవన్ పరిమితం అయ్యే అవకాశం కనిపించటం లేదు. ఖచ్చితంగా జనసేనకు సీట్లు -అధికారంలో ప్రాధాన్యత కోరుకుంటున్నారు. అందులో భాగంగానే టీడీపీ తగ్గాలి అంటూ ఓపెన్ గానే తన మనసులో మాట చెప్పారు. టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు ఛాన్స్ లేదని బలంగా చెబుతున్నారు.

చిరంజీవి కోసం బీజేపీ ప్రయత్నాలు
వైసీపీ సైతం అదే కోరుకుంటోంది. ఎంతగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంత ప్రయోజనంగా అంచనా వేస్తోంది. ఇప్పటికే బీజేపీ కేంద్ర నేతలతో సీఎం జగన్ తన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. బీజేపీ - జనసేన కూటమి నుంచి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారంటూ కొద్ది కాలంగా ప్రచారం సాగింది. తమతోనే జనసేన కొనసాగితే ఆ ప్రకటన చేయటానికి బీజేపీ సిద్దమని తెలుస్తోంది.
టీడీపీ తో పవన్ వెళ్లాలని భావిస్తే మాత్రం "మెగా" ప్లాన్ తో రెడీ అవుతోంది. అందులో భాగంగా ప్రధాని ఏపీ పర్యటన వేళ ఆ ప్రతిపాదన ను ఆచరణ రూపంలోకి తీసుకురావటం ప్రారంభించారు. మెగాస్టార్ కు పార్టీ పరంగా సరైన గుర్తింపు ఇచ్చి..ఆయన్ను బీజేపీ తరపున సీఎం అభ్యర్దిగా ప్రకటించేందుకు సిద్దమనే పార్టీ ముఖ్య నేతలు సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆఫర్ - తిరస్కరణ అంటూ ప్రచారం
అందులో భాగంగా ముందుగా నామినేటెడ్ కోటాలో చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు బీజేపీ నేతలు కొందరు చిరంజీవితో మంతనాలు జరపగా.. మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఏపీలో తొలి నుంచి చిరంజీవి పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముందుగా చిరంజవితోనే సమావేశమయ్యారు.
ఆ తరువాతనే పవన్ తో భేటీ అయ్యారు. అయితే, చిరంజీవి గతంలో సీఎం జగన్ తో సన్నిహితంగా మెలిగిన సందర్భాల్లో రాజ్యసభ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని చిరంజీవి ఖండించారు. అసలు తనకు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.

ఆసక్తిగా మారుతున్న సమీకరణాలు
ఇక, భీమవరం వేదికగా అక్కడ వేదిక పైన సీఎం జగన్ - చిరంజీవి ఆలింగనాలు..ఆహ్వానంలో ప్రాధాన్యత..ప్రధానితో చిరంజీవి వేదిక పంచుకొనేలా చూడటం ఇవన్నీ బీజేపీ "మెగా" ప్లాన్ లో భాగంగా తెలుస్తోంది. కానీ, చిరంజీవి మాత్రం చాలా హుందాగా వేదిక పైన వ్యవహరించారు. ఆ సభ తరువాత నాగబాబు చేసిన ట్వీట్ సైతం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.
కానీ, బీజేపీ మాత్రం ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చిరంజీవి మాత్రం ససేమిరా ..తాను తిరిగి రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపించటం లేదని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు కమలం పార్టి నేతలు తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి... జనసేనాని ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కంగా మారుతోంది.












Click it and Unblock the Notifications