ఆ విషయం తెలియదా?: బాలకృష్ణపై నిప్పులు చెరిగిన సోము వీర్రాజు
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను ఎవరైనా తగలబెడితే వెంటనే కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తే మాత్రం ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికే పలు అంశాలపై సోము వీర్రాజు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ఇటీవలే వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై విరుచుకుపడ్డారు.

ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల పరిస్థితిని పరిశీలించిన తర్వాత బాలకృష్ణ మాట్లాడితే బాగుంటుందని వీర్రాజు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్‌కు ప్రధాని సిఫారసు చేసిన విషయం బాలయ్యకు తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్రం నిరంతర విద్యుత్ ఇవ్వడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణలో కేంద్ర పథకాలకు ప్రధాని మోడీ ఫోటో వాడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబు ఫోటో మాత్రమే పెడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంలో మంత్రి పదవి కోసమే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాననడం సరికాదని సోము వీర్రాజు అన్నారు.












Click it and Unblock the Notifications