ఏపీలో పొత్తులపై బీజేపీ తాజా క్లారిటీ ఇదే ! అమిత్ షా-చంద్రబాబుపై భేటీపై ?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఓవైపు విపక్షాల్ని ఏకం చేసేందుకు పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రధాన విపక్షం టీడీపీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. దీంతో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పొడవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ అగ్రనేత అమిత్ షా ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడటంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి.
ఢిల్లీలో అమిత్ షా, చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ-బీజేపీ పొత్తుపై ఊహాగానాలు మరింత పెరిగాయి. అనంతరం ఏపీకి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా ఇద్దరూ వైసీపీ ప్రభుత్వాన్ని ఓ రేంజ్ లో టార్గెట్ చేయడంతో భవిష్యత్తులో ఏం జరగబోతోందన్న దానిపై క్లారిటీ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయిన దుష్యంత్ కుమార్ గౌతమ్ ఇవాళ ఏపీలో పొత్తులపై స్పందించారు.

ఏపీలో పొత్తులపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్.. ఈ వ్యవహారంపై కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో పొత్తులపై ఎన్నికల సమయానికి నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే తాజాగా అమిత్ షా -చంద్రబాబు భేటీ కావడంపై మాత్రం స్పందించేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై ఇప్పుడే మాట్లాడలేమన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తును ఆయన ఖండించలేదు.
అలాగే వచ్చే ఎన్నిక్లలో గెలుపు కోసం పోరాడతామని దుష్యంత్ కుమార్ స్పష్టం చేశారు. అంటే బీజేపీ ఏపీలో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందని చెప్పకనే చెప్పారు. గత ఎన్నికల్లో ఒంటరిపోరుతో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని దెబ్బతిన్న బీజేపీ.. ఈసారి మాత్రం టీడీపీ,జనసేన అండతో ఉనికి చాటుకోవాలని యోచిస్తోంది.












Click it and Unblock the Notifications