ఇవాళ హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. అనుమతించిన పోలీసులు
సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(CJP) దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే దేశ రాజధాని దిల్లీతో పాటు లక్నో తదితర పట్టణాల్లో ఆందోళనలు చేపట్టింది. ఇక ఇవాళ హైదరాబాద్, బెంగళూరులో నిరసనలు చేపట్టనుంది. విద్యావ్యవస్థలో భారీ మార్పులు, జవాబుదారీతనం, పరీక్ష విధానంలో సంస్కరణల కోసం 'గోయింగ్ నేషనల్' ఉద్యమంలో ఈ నిరసనలు, ఆందోళనలు భాగంగా సీజేపీ చెబుతోంది. ఇక హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద జూన్ 14 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సభ్యులు పాల్గొంటారని సమాచారం.
ఇక కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఈ ధర్నాకు అనుమతి కోరుతూ పోలీసులకు వినతి పత్రం ఇవ్వగా.. పోలీసులు అనుమతి ఇచ్చారు. ధర్నాలో 200 మంది యువత పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఆందోళనలను గమనిస్తే ఇందిరా పార్క్ నిరసనలకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతను పెంచాలని, ఫలితాలను సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది సీజేపీ.












Click it and Unblock the Notifications