ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త ఎత్తుగడ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రపక్షాలుగా చెలామణి అవుతోన్న జనసేన, భారతీయ జనతాపార్టీ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నాయి. కరోనావల్ల తమ మధ్య భౌతిక దూరం వచ్చిందని, కరోనా తగ్గిపోగానే ఈ దూరం కూడా తగ్గిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలోనే వ్యాఖ్యానించారు. వైసీపీపై పోరాటం చేస్తున్న తనకు ఏపీ బీజేపీ నేతలు కొందరు సహకరించడంలేదని భావిస్తున్న పవన్ అసంతృప్తిగా ఉండటంతోపాటు బీజేపీకి దూరం జరగడం ప్రారంభించారు. భీమవరంలో జరిగిన ప్రధానమంత్రి సభకు, అంతకుముందు జేపీ నడ్డా గోదావరి గర్జనకు హాజరవలేదు. బీజేపీతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనను బలోపేతం చేయడంపై దృష్టిసారించారు.

తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని..
తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఢిల్లీ పెద్దలు జనసేనతో సఖ్యతగా ఉండాలని, ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దంటూ ఏపీ బీజేపీ నేతలకు సమాచారం పంపించినట్లు తెలుస్తోంది. ఇరుపార్టీల మధ్య సఖ్యత లేదని భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా వీరి మధ్య ఉన్న సంబంధాలు బలోపేతమవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పట్టు కోసం బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విశ్లేషిస్తున్నారు.

ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా..
తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై దృష్టిసారించింది. ఇక్కడున్న సెటిలర్లను తనవైపు తిప్పుకోగలిగితే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు తమ ఖాతాలో చేరతాయని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తోందని భావిస్తున్న సెటిలర్లు గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితివైపు మొగ్గారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న 2014 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో మంచి ఫలితాలే సాధించగలిగింది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లు ఉన్న వార్డుల్లో ఆ పార్టీ గెలవలేకపోయింది.

పవన్ కల్యాణ్ వల్ల కలిసొస్తుందా?
సెటిలర్లను అనుకూలంగా మార్చుకోవాలంటే జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరిపై గట్టి పట్టున్న తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు లేకపోవడంతో పవన్ ద్వారా, బీజేపీలో చేరిన టీడీపీ మాజీ నేతలు గరికపాటి నరసింహారావు, సుజనాచౌదరి, సీఎం రమేష్ ద్వారా గ్రేటర్ పై పట్టుకోసం ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే వీరు తనపార్టీకి అనుకూలంగా ఉండటం ఒక్కటే మార్గమని ఆ పార్టీ నేతలు ఒక నిశ్చయానికి వచ్చారు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంతో, కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండటంతో కొందరు సెటిలర్లు కేసీఆర్ వైపు ఉన్నారు. వీరిని ఎలా తిప్పుకుంటారనేది ఇప్పుడు బీజేపీ పెద్దల ముందు ఉన్న ప్రశ్న. ఏదేమైనప్పటికీ ఆ పార్టీ తన స్నేహితుడిద్వారా తెలంగాణపై పట్టు సాధించాలనే ఉద్దేశంతోపాటు ఏపీలో ఆయన ఎటూ జారిపోకుండా తనవైపు ఉండేలా చూసుకుంటోంది.