జగన్ ఇలాకాలో బీజేపీ ముఖ్య నేతలు -రాయలసీమ రణభేరి : పొత్తులపై తేల్చేస్తారా..!!
ముఖ్యమంత్రి జగన్ ఇలాకాకు బీజేపీ ముఖ్య నేతలు తరలి వస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో స్పష్టం చేసిన రూట్ మ్యాప్ ఆధారంగా బీజేపీ నేతలు రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అమరావతి విషయం పైన క్లారిటీ ఇవ్వటంతో పాటుగా.. అమరావతి రైతులు చేసిన పాదయాత్రలోనూ పాల్గొన్నారు. జనసేనతో పొత్తు కొనసాగిస్తూనే.. పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారనేది గమనిస్తున్నారు.
బీజేపీ తమకు వైసీపీని ఎదుర్కొనే విషయంలో రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పందని..త్వరగా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం అమిత్ షా పర్యటనలోనే రోడ్ మ్యాప్ ఇచ్చేసారని చెప్పటం ద్వారా ఇక, బీజేపీ నుంచి పవన్ కు కొత్తగా వచ్చేది ఏదీ లేదని స్పష్టం అవుతోంది. ఈ సమయంలో రాయలసీమ పైన బీజేపీ నేతలు ఫొకస్ చేస్తున్నారు.

కడప కేంద్రంగా బీజేపీ వ్యూహం
అందులో భాగంగా.. ఈ రోజు కడపలో బహిరంగ సభకు బీజేపీ నిర్ణయించింది. కడపలో రాయలసీమ రణభేరి పేరుతో ఈ మధ్నాహ్నం సభ నిర్వహించనున్నారు. కేంద్ర మంతి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. పురంధేశ్వరితో సహా రాష్ట్రంలోని బీజేపీ ముఖ్యులంతా కడప సభకు రానున్నారు. ఈ సభను పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమర్ మార్గదర్శకంలో నిర్వహిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా సీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండును వినిపించాలని నిర్ణయించారు. అదే విధంగా..జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతున్నా.. రాయలసీమకు ఎటువంటి లాభం జరగలేదని బీజేపీ నేతలు ఈ సభ ద్వారా చెప్పేందకు సిద్దమయ్యారు. సీమ ప్రాంతంలోని సమస్యలను ప్రస్తావించనున్నారు.

పవన్ డిమాండ్ పైన స్పందిస్తారా
అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తున్న కేంద్రంలో భాజపా ప్రభుత్వం... అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వ వ్యత్యాసాలను ప్రజలకు తెలియ జేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాయలసీమలో వైసీపీకి బలమైన పునాదులు ఉన్నాయి. తాజాగా, మూడు రాజధానుల నిర్ణయంతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ద్వారా న్యాయ రాజధాని దిశగా నిర్ణయం తీసుకుంది. అయితే, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. కడపలోని స్టీల్ ప్లాంట్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రతిపక్షా లు ప్రశ్నిస్తున్నాయి. ఇక, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ పాత్ర పైన స్పష్టత రావాల్సి ఉంది.

రాష్ట్రంలో భవిష్యత్ పొత్తుల పైనా
జనసేన - బీజేపీ పొత్తు కొనసాగదనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో జనసేన - టీడీపీ మధ్య పొత్తు ఖాయమనే ప్రచారమూ జరుగుతోంది. దీంతో..బీజేపీ తిరిగి 2014 ఎన్నికల తరహాలో తిరిగి బీజేపీ - టీడీపీ - జనసేన ఒకే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయా.. లేక, బీజేపీ గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో తిరిగి టీడీపీతో కలిసే అవకాశం లేదనే అంశం పైన ఈ సభ ద్వారా క్లారిటీ ఇస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ రోడ్ మ్యాప్ గురించి ఓపెన్ గా మాట్లాడటంతో..ఇప్పుడు ఇదే అంశం పైన బీజేపీ నేతలు సైతం బహిరంగ సభ ద్వారానే దీని పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా నుంచి బీజేపీ నేతలు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications