సీఎం అలా చెబితే రాజీనామా చేస్తా - బీజేపీ నేత సత్యకుమార్ ..!!
ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేఖ రాసారు. అమరావతి రైతుల పాదయాత్ర పైన ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయని సత్య కుమార్ ఆక్షేపించారు. అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డుపడవద్దని కోరారు. మూడు ముక్కలాట తప్ప మూడేళ్లలో చేసింది ఏమీ లేదనీ లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని సమర్ధించలేదని సీఎం చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ను మరింత విభజించే ఆలోచనలు సరి కావని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కనీసం రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితలో ఉన్నారని దుయ్యబట్టారు. వెయ్యి రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతులను ఒక్క సారి కూడా పిలిచి మాట్లాడకపోవటంతో సమస్య తీవ్రత పెరిగిందన్నారు. అమరావతి రైతులతో మాట్లాడాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఉత్తరాంధ్ర -రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసారో చెప్పాలని సత్య కుమార్ డిమాండ్ చేసారు. ఉత్తరాంధ్ర కోసం ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు. సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసారని దుయ్యబట్టారు.

ప్రతిష్ఠాత్మక సంస్థలు వెళ్లిపోయాయని ధ్వజమెత్తారు. రాయలసీమలో ఇప్పటి వరకు రైళ్లు లేని ప్రాంతాలకు రైల్వే లైను..సౌకర్యాల కల్పనకు కేంద్రం సిద్దంగా ఉన్నా.. వినియోగించుకోవటం లేదని పేర్కొన్నారు. న్యాయ రాజధానిగా కర్నూలకు పేరు పెట్టి ఏమీ చేయటం లేదని విమర్శించారు. హైకోర్టు తీర్పు తరువాత కూడా వైఖరిలో మార్పు రాకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానులకు మద్దతు లేదని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఎప్పుడో ఒక సారి జరిగే అసెంబ్లీ సమావేశాలే అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకోవటం న్యాయమా అని ప్రశ్నించారు. మంత్రులకే స్వేచ్చ ఇవ్వటం లేదని, గ్రామ - జిల్లా స్థాయిలో అధికారాలు అప్పగిస్తారనుకోవటం అత్యాశే అవుతుందని సత్యకుమార్ తన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications