జగన్ టార్గెట్ ప్రధాని పదవే- సీఎంగా సంతృప్తి లేదు-ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అసలే రాష్ట్రంలో రాజకీయమంతా రెండు కేసులు, వాటి దర్యాప్తులు, కోర్టు విచారణలుగా మారిపోతున్న తరుణంలో రాజకీయ నేతలు ప్రత్యర్ధులపై రాళ్లు వేసేందుకు వీటినే ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీని విపక్ష నేతలు నిత్యం టార్గెట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వైఎస్ జగన్ అంటే మండిపడే రాజకీయనేతల్లో ఒకరైన కడప జిల్లా జమ్మలమడుగు నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సీఎం పదవిపై సంతృప్తి లేదని, ప్రధాని పదవిపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిపైనే ఆయనకు ఆశ పుట్టిందన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న వైఎస్ వివేకా హత్య కేసుపైనా ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య వెనుక విస్తృత కుట్ర దాగుందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ విషయం సీబీఐకి కూడా తెలుసున్నారు. విస్తృత కుట్ర అంటే దాని వెనుక పెద్ద మనుషులు దాగున్నారని ఆది వెల్లడించారు. వివేకా కేసులో తన పాత్రపైనా అనవసర విమర్శలు చేస్తున్నారని ఆది తెలిపారు. వివేకా హత్యలో తన పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే ఢిల్లీ ఏపీ భవన్ లో ఉరిశిక్ష వేసుకుంటానన్నారు.
వివేకాను ప్లాన్ ప్రకారమే హత్య చేశారని, దీంతో సంబంధం ఉన్న వారంతా బయటికి వస్తారని ఆది వెల్లడించారు. హత్య చేసిన తర్వాత ఆధారాలు చెరిపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. అరెస్టు భయంతోనే వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను తప్పుబట్టడంపై ఆదినారాయణరెడ్డి అభ్యంతరం తెలిపారు. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం అమెరికా కూడా వెళ్తారా అని ఆది ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications