బిజెపి క్లియర్: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కార్నర్, జగన్ అందుకే...
Recommended Video

అమరావతి: వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను పోషించాల్సిన పాత్రపై ఇప్పటికే బిజెపి నాయకత్వం స్పష్టతకు వచ్చినట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయడం దాని ఉద్దేశంగా కనిపిస్తోంది.
అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను కూడా కార్నర్ చేయాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

చంద్రబాబు ఎందుకు టార్గెట్
చంద్రబాబును బిజెపి నాయకత్వం లక్ష్యంగా చేసుకుని ఎపి రాజకీయాలను శాసించాలనే వ్యూహాన్ని బిజెపి ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుతో కలిసి పనిచేసినంత కాలం తమ పార్టీ ఎదగదనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తి స్థాయిలో తమ చెప్పుచేతల్లో ఉండవని కూడా అనుకుంటున్నట్లు తెలస్తోంది. అందువల్లనే చంద్రబాబును టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు.

పవన్ కల్యాణ్ ఎందుకు టార్గెట్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన బిజెపి నాయకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు సీట్లు రావడం మాట అటుంచి, తమను శాసించే స్థాయికి చేరుకున్నా అశ్చర్యం లేదనేది బిజెపి ఆలోచనగా చెబుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబు ఏం చేస్తారు...
రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విమర్శలు చేస్తూ తన ఎంపీల చేత పార్లమెంటులో ఆందోళన చేయిస్తున్న చంద్రబాబు తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని జగన్ ఆరోపిస్తూ వస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు మాత్రం బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి జంకుతున్నట్లే కనిపిస్తున్నారు.

వైఎస్ జగన్ ఎందుకలా..
బిజెపితో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో జగన్ ప్రత్యేక హోదాను కూడా పక్కన పెట్టేశారని ఇంత వరకు అనుకుంటూ వస్తున్నారు. కానీ ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదంటూ ప్రత్యేక హోదానే కావాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. పైగా, తమ ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తారని కూడా ప్రకటంచారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెబుతున్న బిజెపిని అదే అడగడం ద్వారా బిజెపిని చిక్కుల్లో పడేస్తున్నారా, లేదా జగన్‌కు మరో వ్యూహం ఏదైనా ఉందా అనేది ఆలోచించాల్సిన విషయమని అంటున్నారు.

ఆ డిమాండ్‌తోనే...
జగన్ పోరాట కార్యక్రమానికి గానీ చంద్రబాబు ఒత్తిడికి గానీ తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదానో, మరిన్ని నిధులనో ఇస్తుందనే నమ్మకం లేదు. ప్రత్యేక హోదా అనేది ఇప్పటికే సెంటిమెంటుగా మారింది. ఈ తరుణంలో ఆ నినాదంతోనే జగన్ ఎన్నికల బరిలోకి దిగాలని జగన్ అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు జగన్ బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు.

ఆ నినాదం ద్వారా గెలిచి..
ప్రత్యేక హోదా నినాదం ద్వారా ప్రజలను తనకు అనుకూలంగా తిప్పుకుని సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలనే తలంపుతో జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. బిజెపి కూడా అదే ఆశిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు అవగాహన మేరకు కేంద్రంలో ఎన్నికల తర్వాత బిజెపిని బలపరిచే అవకాశాలున్నాయి. అందుకే, జగన్ బలపడే విధంగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ బలహీనపడే విధంగా బిజెపి వ్యూహం రచించిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications