అత్త కొట్టినందుకు కాదు.. తోడికోడలు తొంగి చూసినందుకే!!
అత్త కొట్టినందుకు కాదు.. తోడికోడలు తొంగిచూసినందుకే కోడలికి ఎక్కువ బాధ అని తెలుగులో ఒక సామెత ఉంది. అలాగే ఏపీలో భారతీయ జనతాపార్టీ వ్యవహరిస్తున్న తీరు ఇలాగే ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తాము కలిసుంటామా? లేదా? అనేది వారికి కూడా స్పష్టత లేదు. కానీ తెలుగుదేశం-జనసేన కలవకుండా ఉంటే చాలు అన్నట్లుగా ఇక్కడి నాయకత్వం వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ నేతల గగ్గోలు
జనసేన పార్టీ అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినప్పటికీ, పవన్ కల్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ బీజేపీ మాత్రం జనసేన తమతోనే ఉందని నిత్యం గగ్గోలు పెడుతూనే ఉంది. మిత్రపక్షంగా ఎటువంటి గౌరవం ఇవ్వకుండా.. సమాచారం తెలియజేయకుండా.. పవన్ కల్యాణ్ తో సంబంధం లేకుండానే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల అనంతరం నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఉండవల్లి నుంచి తుళ్లూరు వరకు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో జనసేనకు తెలియజేయలేదు.. పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు భీమవరం వచ్చినప్పుడు మాటమాత్రంగా చెప్పలేదు. కానీ పవన్ కు ఆహ్వానం పంపించామని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.

కరోనా వల్ల పెరిగిన భౌతిక దూరం!!
అంతకు ముందు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రిలో గోదావరి గర్జనకు హాజరయ్యారు. అప్పుడు కూడా బీజేపీ ఒంటరిగానే కార్యక్రమాలు నిర్వహించింది. ఆ తర్వాత కూడా జరిగిన పలు కార్యక్రమాలు బీజేపీ, జనసేన విడివిడిగానే నిర్వహించాయి. పొత్తులపై స్పందించమని పవన్ కల్యాణ్ ను మీడియా సమావేశంలో కోరగా కరోనా వల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గగానే ఆ దూరం కూడా తగ్గిపోతుందన్నారు. కలిసే అవకాశమే లేదని పవన్ ఆరోజే పరోక్షంగా చేశారు.

పవన్ కు నమ్మకం కల్పించలేకపోయిన బీజేపీ?
బీజేపీ నేతలు కూడా జనసేనాని విషయంలో మర్యాదలు పాటించిన సందర్భాలే లేవు. ఇప్పుడు మాత్రం మా వెంటే ఉన్నాడు.. మాతో పొత్తుంది.. మేం విడిపోలేదు.. కలిసే ఎన్నికలు వెళతామంటూ ఆ పార్టీ నేతలు గొంతు చించుకుంటున్నప్పటికీ జనసేన నుంచి స్పందన రావడంలేదు. కేంద్రంలో అధికారంలో ఉండటంవల్ల ఆ పార్టీతో సఖ్యతగా ఉంటే తన పోరాటానికి కలిసివస్తారనే కోణంలో పవన్ ఆలోచించినప్పటికీ ఏనాడూ ఇక్కడి పార్టీ పెద్దలు అంతటి నమ్మకాన్ని ఆయనకు కల్పించలేకపోయారు. జనసేన జెండాలతోపాటు కమలం జెండాలు నామమాత్రంగా కూడా ఎగరలేదు.

చంద్రబాబుతో వైరమే ప్రధానం?
పవన్ కల్యాణ్ తో పొత్తుకన్నా చంద్రబాబుతో ఉన్న వైరమే బీజేపీకి గుర్తుకొస్తోంది. తెలుగుదేశం, జనసేన పొత్తుపెట్టుకొని పోటీచేస్తే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. జనసేన చీల్చిన ప్రతిచోటా టీడీపీ దారుణ పరాభవాన్ని చవిచూసింది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే సానుకూల పరిణామాలే ఉంటాయని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జనసేన ప్రతినిధులతో మాట్లాడగా.. తమతో స్నేహానికన్నా టీడీపీతో వైరాన్నే ఆ పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని, బీజేపీ-జనసేనకన్నా టీడీపీ-జనసేన కలవకుండా చూడటమే వారికి ప్రధానంగా మారినట్లుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications