రైతులకే కాదు ప్రజలకు తీపికబురు.. ఇకపై ప్రతీ జిల్లా కేంద్రంలోనూ ఆ మార్కెట్లు!
తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ముఖ్యమైన చర్యలు చేపట్టింది. రసాయనాలు లేని, సహజ పద్ధతుల్లో పంటలు పండించే రైతులకు మంచి ధర లభించేలా మరియు ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆర్గానిక్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని జిల్లా కేంద్రాల్లో అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి సేకరణ పనులు వేగంగా చేపట్టింది.
సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు
ప్రస్తుతం తెలంగాణలో సుమారు 10,000మంది రైతులు 61,125 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. వీరు ఎలాంటి రసాయన ఎరువులు. పురుగు మందులు వాడకుండా, పశువుల ఎరువు, జీవామృతం వంటి సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు. మామిడి, సపోటా, జామ, టమాటా, వంకాయ, మిర్చి, క్యారెట్, మునగ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, చెరకు, పసుపు వంటి అనేక రకాల పంటలు ఈ రైతులు సాగు చేస్తున్నారు.

ప్రత్యక్ష మార్కెట్ల ఏర్పాటుకు నిర్ణయం
ఇప్పటికే ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తుల విక్రయం కోసం ఒక మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. అయితే డిజిటల్ వేదికపై అవగాహన లోపం కారణంగా అనుకున్నంత ప్రభావం చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష మార్కెట్ల ఏర్పాటు ద్వారా రైతులు మరియు వినియోగదారుల మధ్య నేరుగా సంబంధం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
వారానికో రోజు ఆర్గానిక్ మార్కెట్లు
తొలి దశలో హైదరాబాద్‌లో సచివాలయం, శాసనసభ, బీఆర్‌కే భవన్, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల వద్ద వారానికి ఒకరోజు చొప్పున ఈ మార్కెట్లను నిర్వహించనున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తే వారంలో ఎక్కువ రోజులకు విస్తరించాలని భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ల పర్యవేక్షణలో స్థలాలు గుర్తించి మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
నేరుగా రైతుకు లబ్ది జరిగేలా నిర్ణయం
ఈ కొత్త వ్యవస్థ ద్వారా మధ్యలో దళారులు లేకుండా రైతులు నేరుగా మంచి ధర పొందడంతో పాటు, ప్రజలు తాజా, విషరహిత ఆహారం కొనుగోలు చేసే వీలుంటుంది. సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతను ధృవీకరించేందుకు అధికారిక సంస్థల్లో నమోదు చేసుకునే రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది.
రైతుల ఆదాయం పెంచడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రయత్నం
ఇలాంటి చర్యలు రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసి, రైతుల ఆదాయం పెంచడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ముందుకు వెళ్తాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణలో సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు లభించి, రైతులు స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, ఆరోగ్యంపై శ్రద్ధ గల ప్రజలకు ఆ ఆర్గానిక్ మార్కెట్ ల ద్వారా మంచి వేదిక అందుబాటులోకి వస్తుంది.













Click it and Unblock the Notifications