టీడీపీని టెన్షన్ పెడతున్న బీజేపీ తాజా సీట్ల జాబితా...!!
ఏపీలో పొత్తులు ఖాయమైనా సీట్ల పంచాయితీ తేలలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. కానీ, సీట్ల సంఖ్య..స్థానాల పైన బీజేపీ నుంచి టీడీపీకి కొత్త ప్రతిపాదన లు అందుతున్నాయి. బీజేపీ తేల్చకుండా టీడీపీ తమ ఎంపీల జాబితా సిద్దమైనా ప్రకటన చేయటం లేదు. బీజేపీ ఏపీ నేతలు సీనియర్లకు సీట్లు ఇవ్వాలంటూ రాసిన లేఖ పైన చర్చ సాగుతోంది. అభ్యర్దుల ఎంపికలోనూ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
పొత్తుల లెక్కలు : పొత్తులో భాగంగా బీజేపీ అగ్ర నేతలతో జరిగిన చర్చల్లో సీట్ల సంఖ్య పైన ఒక నిర్ణయం జరిగింది. అభ్యర్దుల ఎంపిక పైన దాదాపు అంగీకరానికి వచ్చారు. కానీ, ఏపీ బీజేపీ సీనియర్లు టీడీపీ కేటాయించిన సీట్లు.. అభ్యర్దుల పేర్ల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ నాయకత్వానికి లేఖ రాసారు. టీడీపీ ఓడే సీట్లను కేటాయించిందని ఫిర్యాదు చేసారు. బీజేపీ నుంచి గతంలో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వారికి సీట్లు ఇస్తున్నారనే ప్రచారం పైన ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసారు. దీని పైన పార్టీ నేతలు పురందేశ్వరి ని ఢిల్లీకి పిలిపించి చర్చలు చేస్తున్నారు.

బీజేపీ తర్జన భర్జన : నర్సాపురం నుంచి రఘురామ రాజు సీటు పైన స్పష్టత రావటం లేదు. అక్కడ నుంచి నరేంద్ర వర్మ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ, తాజాగా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు తనకు రాజమండ్రి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. దీని పైన పార్టీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పది ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వగా, ఇప్పుడు మరో స్థానం పెంపు ఖాయమని చెబుతున్నారు. ఫలితంగా 11 ఎమ్మెల్యే 6 ఎంపీ స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసారు. 21న ఢిల్లీలో జరిగే పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఆరు ఎంపీ స్థానాల్లో మార్పుల కోసం టీడీపీ పైన ఒత్తిడి పెరుగుతోంది.

తుది కసరత్తు : ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీ నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, అరకు, అనకాపల్లి ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే, విజయనగరం, అరకు, అనకాపల్లి స్థానాల్లో ఒకటి మినహాయించి విశాఖ ఇవ్వాలని తాజాగా బీజేపీ నేతలు కోరుతున్నారు ఇక..అభ్యర్దుల పరంగా అరకు నుంచి కొత్తపల్లి గీత, నర్సాపురం నుంచి నరేంద్ర వర్మ, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ రత్నప్రభ కుమార్తె,విజయనగరం నుంచి మాధవ్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి / సుజనా చౌదరి / సోము వీర్రాజు పేర్ల పైన చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే స్థానాల్లో కాకినాడ, బద్వేలు, ఆదోని, జమ్మలమ డుగు, ధర్మవరం, పాడేరు, వైజాగ్ నార్త్, శ్రీకాకుళం, అనపర్తి, కైకలూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు జాబితా - అభ్యర్దుల పైన స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications