రెండు భేటీలు... సూత్రధారి... పాత్రధారి... BJP
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక భేటీ జరిగింది. ఏపీ రాజధాని అమరావతి పరిధిలో మరో భేటీ జరిగింది. ఈ రెండు భేటీలు రాజకీయానికి సంబంధించినవే. పాత్రధారులు వేర్వేరు. కానీ ఈ రెండు భేటీల్లో ప్రధానం మాత్రం బీజేపీనే. ఎందుకంటే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. అలాగే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎంపీ సీఎం రమేష్ భేటీ జరిపారు. రెండు సంఘటనలు, రెండు వేర్వేరు పరిణామాలైనప్పటికీ భారతీయ జనతాపార్టీయే ఇక్కడ కీలకపాత్ర పోషిస్తోంది.
అమిత్ షాతో సీఎం రమేష్ జరిపిన భేటీలో ఏపీలో రాజకీయ పరిణామాలు, లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడం, పొత్తులకు సంబంధించి 40 నిముషాల కీలక సమావేశం జరిగిందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పరిస్థితులు గతంలో ఉన్నంత సులువుగా లేవని బీజేపీ నేతలకు తెలుసు. తగ్గే సీట్లను దక్షిణాదిలో పెంచుకునేందుకు వ్యూహం రచించారు. అందులో భాగంగానే సీఎం రమేష్ తో భేటీ అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

అలాగే కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు. సోము వీర్రాజుకు, కన్నాకు మధ్య కొంతకాలంగా పొసగడంలేదు. అనుకున్న రీతిలో సోము ఉద్దేశపూర్వకంగానే రాజకీయం చేయడంలేదనేది కన్నా ఆరోపణ. జనసేన-తెలుగుదేశం మధ్య పొత్తుకు ప్రధాన అడ్డంకిగా బీజేపీ నిలుస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఢిల్లీలో కన్నాకున్న పరిచయాలను ఉపయోగించుకొని టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుల దిశగా ప్రయత్నించాలని కోరేందుకు నాదెండ్ల మనోహర్ కన్నాను కలిశారంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఢిల్లీ పెద్దలు సర్దిచెప్పి పార్టీలోనే కొనసాగేలా చూశారు. అయితే ఈ ఇద్దరి భేటీకానీ, సీఎం రమేష్ జరిపిన భేటీ కానీ ప్రధానంగా బీజేపీయే కీలక పాత్రధారిగా ఉంది. ఈ భేటీలు అంతిమంగా ఎటువంటి ఫలితాన్నిస్తాయో వేచిచూడాలి.













Click it and Unblock the Notifications