ఢిల్లీలో బీజేపీ గెలుపు ఏపీలో ఎవరికి ముప్పు ? లెక్కలు మారబోతున్నాయా ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 27 ఏళ్ల విరామం తర్వాత ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఎన్డీయే చేతిలో, అలాగే బీజేపీ చేతిలో ఉన్న రాష్ట్రాల సంఖ్యను మరింత పెంచింది. అలాగే ఇండియా కూటమి చేతిలో ఉన్న రాష్ట్రాల లెక్కను సైతం సవరించింది. అయితే ఢిల్లీలో బీజేపీ సాధించిన విజయం కచ్చితంగా దీర్ఘకాలంగా ఆ పార్టీ విజయం కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రాల్లో ప్రణాళికల్ని మరింత వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది.
ముఖ్యంగా దక్షిణాదిలో ఇప్పటికే ఎన్డీయే కూటమి ప్రభుత్వం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్టంపై దీని ప్రభావం కచ్చితంగా ఉండబోతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో గత ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే పవన్ ఇలా బీజేపీతో కలిసి వెళ్తే ఫలితం ఉండదని తేలిపోవడంతో పలు సర్వేల తర్వాత టీడీపీతో జట్టు కట్టారు. ప్రస్తుతానికి పవన్, చంద్రబాబుతో కలిసి ఏపీలో ప్రభుత్వం నడుపుతున్నా.. వీరిద్దరి విషయంలో ప్రధాని మోడీ చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ను బీజేపీ అజెండా అమలు చేయగల నాయకుడిగా చూస్తున్న ప్రధాని మోడీ.. చంద్రబాబును మాత్రం మైనార్టీలను దూరం చేసుకోలేని నేతగానే చూస్తున్నారు. అలాగే జగన్ ను సైతం పూర్తిస్దాయిలో మైనార్టీలతోనే కొనసాగే నేతగా చూస్తున్నారు. దీంతో భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో కానీ లేదా ఆలోపే జమిలి ఎన్నికలు వచ్చినా కేవలం జనసేనతో కలిసి వెళ్లి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపు.. ఆ ప్రయత్నాలను మరింత వేగవంతం చేసేందుకు పనికొస్తుందని చెబుతున్నారు. ఈ దిశగా రాష్ట్ర బీజేపీ నేతలకు త్వరలో అధిష్టానం సంకేతాలు ఇస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications